చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం - మోదీ సమక్షంలో..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఇద్దరు నేతలు గాంధీ నగర్ వేదికగా భేటీ అవ్వనున్నారు. ఏపీలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు.. వరదలతో భారీ నష్టం జరిగింది. వరద నష్టం పైన కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. కేంద్రం నుంచి సాయం కోసం వేచి చూస్తోంది. ఈ సమయంలోనే గుజరాత్ లోని గాంధీనగర్ వేదికగా ప్రధానితో చంద్రబాబు మీటింగ్ జరగనుంది.
గుజరాత్ కు చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 16న గుజరాత్ వెళ్లనున్నారు. గాంధీ నగర్ లో ఈ నెల 16 నుంచి 18 వరకు రీ ఇన్వెస్ట్ 24 సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సమావేశంలో తొలి రోజు చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఏపీలో అమలు చేయనున్న సోలార్, సోలార్ - విండ్, హైడ్రో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి గురించి వివరించనున్నారు. ఈ ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, ప్రాధాన్యత, విధాన పరమైన నిర్ణయాల పైన వివరించనున్నారు.

ప్రధానితో భేటీ
ఈ సదస్సుకు రావాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. సదస్సుకు హాజరు కావాలని నిర్ణయించిన చంద్రబాబు రాష్ట్ర ఇంధన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. సదస్సులో ప్రసంగం పైన చర్చించారు. ఇక..ఈ సదస్సు సమయంలోనే ప్రధానితో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించనున్నారు. భారీ వర్షాలు..వరదల కారణంగా జరిగిన నష్టం..సహాయక చర్యల పైన ప్రధానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రానికి నిధులపై
ఇప్పటికే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటుగా కేంద్ర అధికారుల టీం రాష్ట్రంలో పర్యటించింది. వరదల కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం ఆర్దికంగా సహకరించాలని చంద్రబాబు కోరనున్నారు. అదే విధంగా అమరావతికి రూ 15 వేల కోట్ల రుణం..పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదించిన డీపీఆర్ లో అడ్వాన్స్ నిధుల గురించి చర్చించే అవకాశం ఉంది. దీంతో..రాష్ట్రానికి వరద సాయం పైన ప్రధాని ఏం చెబుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications