వైసీపీ చేసిన పాపాలు ప్రజలకు శాపాలు, మింగింది కక్కించే వరకు వదలం, చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ వర్షంలోనే విజయవాడలోని పలు ప్రాంతాలు పర్యటించారు. వరద నీటిలోనే జేసీబీ ఎక్కిన చంద్రబాబు మారుమూల ముంపు ప్రాంతాలకు వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుమారు ఆరు రోజుల నుండి మేము నానా ఇబ్బందులు పడుతున్నామని వరద బాధితులు సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించారు.
ఆహారం, నీరు, నిత్యవసర వస్తువులు అందుతున్నా వరదల కారణంగా చాలా నష్టపోయామని బాధితులు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న వస్తువులు, ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు వరద నీటి దెబ్బ తిన్నాయని, మమ్మల్ని ప్రభుత్వం అన్ని విదాలుగా ఆదుకోవాలని స్థానిక మహిళలు చంద్రబాబు నాయుడుకి మనవి చేశారు. సోమవారం ఉదయానికి వరద నీరు తొలగిస్తామని అంతవరకు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.

ఓల్డ్ ఆర్ ఆర్ పేట, న్యూ ఆర్ ఆర్ పేట, నందమూరి నగర్, సింగ్ నగర్, మ్యాంగో మార్కెట్, చిట్టినగర్, సితార సెంటర్, భవానిపురం తదితర ప్రాంతాలలో చంద్రబాబు నాయుడు పర్యటించారు శనివారం రాత్రి విజయవాడ కలెక్టరేట్ కార్యాలయం ముందు సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ నాయకులు చేసిన పాపాలు విజయవాడ ప్రజలకు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు
వైసీపీ నాయకులు బుడమేరు నీ ఇష్టం వచ్చినట్లు కబ్జా చేయడం వల్ల ఇంత జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుడమేరు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రజలు ధైర్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం పులిచింతల, గుండ్లకమ్మ గేట్లను ఏ మాత్రం పట్టించుకోలేదని, వారి నిర్లక్షం కారణంగా ఈరోజు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వరద ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇంకా సుమారు నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయిందని చంద్రబాబు అన్నారు.

విజయవాడలో ఆదివారం కూడా వర్షాలు పడి నీళ్లు పెరిగాయని, ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహం మళ్లీ పెరుగుతోందని చంద్రబాబు అన్నారు. ఆదివారం కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారని చంద్రబాబు అన్నారు. ఆహారం, మంచినీరు, నిత్యవసర కిట్లు ఎవరికైనా అందకపోతే ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేసి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు మనవి చేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి మొదటి విడతగా రూ. 6,880 కోట్లు నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.












Click it and Unblock the Notifications