కల్తీ మద్యం కేసుపై చంద్రబాబు సంచలనం..! సిట్ ప్రకటన..!
ఏపీలో అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో బయటపడ్డ కల్తీ మద్యం రాకెట్ వ్యవహారంపై విపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు ఇవాళ స్వయంగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఆయన వివరించారు. గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కాంకూ, ప్రస్తుతం బయటపడ్డ నకిలీ మద్యం రాకెట్ కూ తేడా ఏంటో సీఎం వెల్లడించారు.
నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తెచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో నకిలీ మద్యం ఒకటన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఏరులై పారించిందని, లీగలైజ్ చేసేసిందని ఆరోపించారు. గంజాయిని వాణిజ్య పంటగా భావించి గత పాలకులు పండించారని, గంజాయి సరఫరా చేశారని గుర్తుచేసారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను ప్రక్షాళన చేయడం ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వంలోని పెద్దలు తమకు సంబంధించిన మనుషులకు చెందిన కంపెనీల బ్రాండ్లనే అమ్మారన్నారు. బలవంతంగా డిస్టలరీలు హ్యండోవర్ చేసుకున్నారని, నేర సామ్రాజ్యాన్ని సృష్టించారని బాబు ఆరోపించారు.

గత ప్రభుత్వంలో జరిగిన మద్యం దోపిడీపై సిట్ వేశామని, విచారణ జరగుతోందని తెలిపారు. మద్యం విషయంలో కొందరు ఇంకా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. నేరాలు చేయడం, ఎదుటి వారిపై ఆ నేరాల్ని మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని, కంట్రోల్లో పెడతామని హెచ్చరించారు. గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రానికి వచ్చేదని, గత పాలనలో నాణ్యమైన మద్యం లేకపోవడం, ధరలు విపరీతంగా ఉండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి అయ్యేదన్నారు. ఇప్పుడు కంట్రోల్లో పెట్టామని, బెస్ట్ మద్యం పాలసీ తెచ్చామని గుర్తుచేశారు.
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించామని సీఎం తెలిపారు. వీరిలో 16 మందిని అరెస్ట్ చేశారన్నారు. ఇబ్రహీంపట్నం కేసులో 12 మంది నిందితులను గుర్తించగా ఏడుగురిని అరెస్టు చేశారన్నారు. 4 పీటీ వారెంట్‌లు నమోదు చేశారన్నారు. ఈ కేసులో మూలాల్లోకి పోతే షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయని, అరెస్టులతో నిజాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయని, తీగ లాగితే డొంక కదులుతోందని బాబు తెలిపారు. దీనిపై మరింత విచారణ కోసం సిట్ వేస్తున్నట్లు ప్రకటించారు. ఐపీఎస్ లు అశోక్ కుమార్, రాహుల్ దేవ్ శర్మ, చక్రవర్తి, మల్లికా గార్గ్, ఎక్సైజ్ శాఖలో మరొకరితో సిట్ వేస్తున్నట్లు వెల్లడించారు.

తనకు ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. ములకల చెరువు ఘటన బయట పెట్టిందే తామని, అరెస్టులు చేసింది తామేనని, వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడిస్తుంది కూడా తామేనని బాబు తెలిపారు. సిట్ విచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయని, ఎవరూ తప్పించుకోలేరన్నారు. నకిలీ మద్యం తయారు చేయడం ఆఫ్రికాలో నేర్చుకున్నారని, అక్కడ నేర్చుకుని ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేయడానికి అలవాటు పడ్డారని, దీని వెనక ఎవ్వరున్నా చర్యలు తీసుకుంటామని, రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. తమ పార్టీ వాళ్లపై ఆరోపణలు ఉన్నా.. సస్పెండ్ చేశామని గుర్తుచేశారు. నకిలీ మద్యం కట్టడికి టెక్నాలజీ వాడి యాప్ తెచ్చామని, బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్‌కు సంబంధించిన అన్ని వివరాలు వస్తాయన్నారు.












Click it and Unblock the Notifications