అమరావతి రైతులకు చంద్రబాబు గుడ్ న్యూస్..! మరో ఐదేళ్ల పాటు..
ఏపీలో అమరావతి రాజధాని రైతులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గత ఐదేళ్లుగా మూడు రాజధానుల సాకుతో ప్రభుత్వం వారిని తీవ్ర ఇబ్బందులు పెట్టింది.
ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ వైపు ఏకపక్షంగా మొగ్గిన రైతులకు అండగా నిలవాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగా రైతులకు వచ్చే ఐదేళ్ల పాటు మేలు చేసే మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వారికి భారీ ఊరట లభించింది.

అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు దాదాపు 36 వేల మూడు పంటలు పండే భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారు. దీనికి ప్రతిఫలంగా రాజధానిని అభివృద్ధి చేసి వారికి మెరుగైన ఫ్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ఆలోపు వ్యవసాయం లేకపోవడంతో ఆర్ధికంగా వారు ఇబ్బందులు పడకుండా ఏటా కౌలు చెల్లింపుకు ప్రభుత్వం అంగీకరించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉండగా దీనికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ప్రతీ ఏటా వారికి చుక్కలు చూపించింది. దీనిపై ప్రతీ ఏటా హైకోర్టు ఆదేశాలు వచ్చాకే కౌలు చెల్లించేవారు.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారికి ఊరటనిచ్చే మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఏటా ఇస్తున్న కౌలును అంతే మొత్తం వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఎలాగో వచ్చే ఐదేళ్ల పాటు రాజధాని నిర్మాణం కొనసాగడం ఖాయం. కాబట్టి ఈ ఐదేళ్లలో వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కౌలు గడువును మరో ఐదేళ్ల పాటు పెంచనున్నారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం జరిగే సీఆర్డీయే భేటీలో నిర్ణయం ప్రకటిస్తారు. దీంతో ఇప్పటికే 9 ఏళ్లుగా కౌలు తీసుకుంటున్న రైతులు.. తాజా నిర్ణయంతో మరో ఐదేళ్ల పాటు దీన్ని పొందే అవకాశం లభించనుంది.












Click it and Unblock the Notifications