స్తబ్దుగా ఏపీ రాజకీయం-చంద్రబాబు ఎపిసోడ్ పై మాట్లాడితే ఓ తంటా ! మాట్లాడకపోతే..
పీలో స్కిల్ స్కాం పేరుతో విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసిన వైసీపీ ప్రభుత్వం అనంతరం ఆయన్ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ అక్రమాల వ్యవహారాల్లోనూ బుక్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ మూడు కేసులూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లాయి. దీంతో రాబోయే రోజుల్లో ఏ మలుపు తీసుకుంటాయో ఎవరూ ఊహించలేని పరిస్దితి. ఇప్పుడు ఈ పరిణామాలు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో గుబులు రేపుతున్నాయి.
రాష్ట్రంలో నిన్న మొన్నటివరకూ రాజకీయం వేరు. అధికార వైసీపీ తప్పిదాలపై విపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ పోరాటాలు చేసేవి. కానీ చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు అదే అజెండాగా మారిపోయింది. చంద్రబాబు అరెస్టును సమర్ధించుకుంటూ వైసీపీ, తప్పుబడుతూ టీడీపీ, జనసేన, ఏం చెప్పాలో స్పష్టత లేక బీజేపీ గందరగోళంలో పడిపోతున్నాయి. దీనికి తాజాగా ఆయా రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం.

నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ చేస్తున్న హడావిడితో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారన్న అంశం పక్కకుపోతోందని, కాబట్టి తాము కూడా నిత్యం జనాల్లో ఆ అంశాన్ని లైవ్ లో ఉంచేందుకు మాట్లాడాల్సి వస్తోందన్నారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు అరెస్టు వ్యవహారం వైసీపీపైనా ఎలాంటి ప్రభావం చూపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. అదే సమయంలో గతంతో పోలిస్తే వైసీపీకి చెందిన మెజార్టీ నేతలు ఈ వ్యవహారంపై, చంద్రబాబుపై విమర్శలకు జంకుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం ఏమలుపు తిరుగుతుందో తెలియకపోవడమే ఇందుకు కారణం.
అలాగే ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన, బీజేపీ కూడా చంద్రబాబు అరెస్టుపై ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. ఎన్నికలకు ఆరునెలల ముందు ప్రధాన విపక్ష నేతను అరెస్టు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తే రాజకీయంగా ప్రయోజనమా లేక సమర్ధిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న భయాలు వారిని వెంటాడుతున్నాయి. దీంతో జనసేన, బీజేపీలో సైతం ఎక్కువ మంది నేతలు చంద్రబాబు ఎపిసోడ్ పై ఓ స్టాండ్ తీసుకునేందుకు ఆలోచిస్తున్నారు. అలాగే టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించినా.. జనసేన నేతలు మాత్రం క్షేత్రస్దాయిలో పూర్తిస్ధాయిలో ఆ పార్టీతో కలిసి ఆందోళనల్లో పాల్గొనకపోవడం కూడా వారిలో భయాల్ని స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications