చంద్రబాబు ఆడియో టేపై వాదనలు: ఫోన్ ట్యాపింగా, తారుమారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌తో సంభాషించిన ఆడియో రికార్డుకు సంబంధించిన భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ భిన్న కథనాలకు తావు కల్పిస్తుండడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో అయోమయానికి గురైనట్లు కనిపిస్తున్నారు.
తన ఫోన్‌ను ట్యాప్ చేశారని, అది నేరమని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వాలే కూలిపోయిన ఉదంతాలు ఉన్నాయని చంద్రబాబు సోమవారం జరిగిన మహాసంకల్ప సభలో అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు, స్టింగ్ ఆపరేషన్‌కు పాల్పడతావా అంటూ ఆయన కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు. ఆ తర్వాత తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడం నీచాతినీచం అని ఆయన వ్యాఖ్యానించారు.
నిజానికి, చంద్రబాబు ఆడియో రికార్డు లీకయిన రోజే ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ ఈ వివాదానికి తెర తీశారు. ఆ మాటలు చంద్రబాబువి కావంటూ ఫోన్ ట్యాప్ చేశారని ఆయన అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు అక్కడక్కడ మాట్లాడిన మాటలను ఒక దగ్గర చేర్చి గుదిగుచ్చి టేప్ తయారు చేశారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారు ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ రికార్డులపై ఏపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు విభన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేశారని ఆ రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
ఆ మంత్రులూ ఎమ్మెల్యేలే ఫోన్ రికార్డుల్లో దొరికింది తమ చంద్రబాబు కాదని, బాబులాగా మరెవరో వాయిస్ మార్చి మాట్లాడారని అంటున్నారు. ఈ రెండు రకాల వాదనల్లో దేనికి కట్టుబడి ఉండాలనే విషయానికి తెలుగుదేశం పార్టీ వచ్చినట్లు లేదు.












Click it and Unblock the Notifications