జగన్ టార్గెట్ గా సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు పిలుపు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా సంక్రాంతి పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకునే క్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ వాసులంతా కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీకి వెళ్లడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న చంద్రబాబు మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేయడానికి ఇదే సరైన సమయం అని పేర్కొన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి రాతి యుగ పాలనకు ముగింపు పలుకుతూ స్వర్ణ యుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి నుంచి సంకల్పం తీసుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వైసిపి ప్రభుత్వ విధ్వంస పాలన ప్రజల జీవితాలను చీకటి మయం చేసిందని, పండుగ సంతోషాన్ని ప్రజలకు దూరం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దాం అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఈ సందేశం ద్వారా వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించి టిడిపి జనసేన కూటమికి పట్టం కట్టాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రా కదలిరా అంటూ భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్న చంద్రబాబు వచ్చే ఎన్నికలలో ఎలాగైనా ఏపీలో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సందర్భం ఏదైనా సరే ఏక లక్ష్యంతో ముందుకు సాగాలని, ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications