అధినేత వద్దకు భూమాXశిల్పా పంచాయతీ, వర్సిటీలోనే కండువా కప్పిన బాబు
విజయవాడ: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో శిల్బా సోదరులు, ఇటీవలై సైకిల్ ఎక్కిన భూమా నాగిరెడ్డి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వారి మధ్య సయోధ్య లేని విషయం తెలిసిందే. భూమా చేరినప్పటి నుంచి ఇరు వర్గాలకు అంతగా పడటం లేదు.
ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నాడు వీరి గొడవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వద్దకు చేరుకుంటుంది. ఇందుకోసం వీరిద్దరితో పాటు జిల్లా నేత ఫరూక్, పార్టీ జిల్లా అధ్యక్షులు చక్రపాణి రెడ్డిలు కూడా ఆదివారమే విజయవాడ బయలుదేరారు.
భూమా, శిల్పా వర్గీయుల మధ్య సయోధ్య కుదిర్చి కర్నూలు జిల్లాలో సమస్య లేకుండా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటు భూమా, అటు శిల్పా వర్గీయులు ఆధిపత్యం కోసం బహిరంగంగానే ఢీకొంటున్నారు. శిల్పా అనుచరుడి పైన కొద్ది రోజుల క్రితం దాడి జరిగింది. ఆ దాడి భూమా వర్గీయులు చేశారని ఆరోపించారు.

ఇరువురు నేతలు పరస్పరం అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే మొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరిన సందర్భంగా శిల్పా సోదరుడు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, భూమాల మధ్య మాటలు కలిశాయి.
ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీ స్థితిపై చర్చించేందుకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. దీంతో శిల్పా మోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డిలు విజయవాడ వచ్చారు. రాష్ట్రం, పార్టీ భవిష్యత్తు దృష్టా ఆలోచించారని. ఇరువురు నేతలకు చంద్రబాబు సర్ది చెప్పనున్నారని తెలుస్తోంది.
వర్సిటీలో కండువాలు కప్పిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు శనివారం విశాఖలోని ఆంధ్రా వర్సిటీలో నీరు - ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగిశాక.. వర్సిటీ అసెంబ్లీ హాల్లోనే పార్టీ చేరికలకు శ్రీకారం చుట్టారు. పార్టీ మారుతున్న వారికి వర్సిటీ హాల్లో కండువా కప్పారు. ఇది ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
వర్సిటీలోనే కండువాలు కప్పడం ఏమిటని పలువురు మండిపడుతున్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ వైస్ చైర్మన్ రామ్మోహన రావు, కోరాడ రాజబాబు తదితరులు ఉన్నారు. గతంలోను వర్సిటీ అధికారులు, టిడిపి అనుబంధ విద్యార్థి సంఘం కలిసి లోకేష్, చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడం వివాదాస్పదమైంది.












Click it and Unblock the Notifications