తొక్కుకుంటూ పోతాం: చంద్రబాబు, కెసిఆర్ ధ్వజం
మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రజా గర్జన సభలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ఇక జాతీయ పార్టీగా అవతరిస్తుందని, ఎవరూ ఖాళీ చేయలేరని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ పార్టీగా ఢిల్లీలో చక్రం తిప్పి తెలుగు ప్రజల అభివృద్ధికి అహర్నిశలు పని చేస్తామన్నారు.
తెలుగు ప్రజలు ఉన్నంతకాలం తెదేపా ఉంటుందని, జాతీయ పార్టీగా అవతరిస్తామన్నారు. 35 రోజుల దూరంలో ఉన్న ఎన్నికల సమయంలో తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్, తెరాస మోసాలకు బలికావద్దన్నారు. తెలంగాణలో తెదేపా అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. పేదవారికి రాజ్యాధికారం దక్కాలన్నదే టిడిపి ధ్యేయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సైకిల్ స్పీడ్ పెంచి, అడ్డొచ్చిన వాళ్లను తొక్కుకుంటూ పోతామన్నారు.

కెసిఆర్ పనిచేసే వ్యక్తి కాదు, ఫామ్‌హౌస్‌లో పడుకునే వ్యక్తి అని ధ్వజమెత్తారు. కెసిఆర్ తన దగ్గర పని చేశాడని, క్రమశిక్షణ తెలియని వ్యక్తి అన్నారు. నీళ్లు ఇవ్వం, ఉద్యోగులు వెళ్లిపోవాలి లాంటి వ్యాఖ్యలతో మరోసారి తెలుగు ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని దుయ్యబట్టారు.
కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలపై మోపడానికి కెసిఆర్ కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు. తెరాస ఉప ఎన్నికల పార్టీ అని, సాధారణ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు ఘోరమైన ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. దేశంలో కాంగ్రెస్ ఇక అధికారంలోకి రాదని, అవినీతిలో కూరుకుపోయి ప్రజలను నట్టేట ముంచిందన్నారు. కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించి తెలుగు ప్రజల సత్తా చూపాలన్నారు.
విభజనను తానెప్పుడూ వ్యతిరేకించలేదని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ అంటే తనకెంతో అభిమానమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చానని, తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత తమ పార్టీదే అని అన్నారు. తెరాస పార్టీ కేవలం ఉప ఎన్నికల పార్టీ అని, ఒక్కసారి కూడా సాధారణ ఎన్నికల్లో గెలువలేదని అన్నారు. బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని తాను రామబాణం వదిలానని ఆయన చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications