అదానీ-జగన్ వివాదం వేళ చంద్రబాబు కీలక నిర్ణయం-కుప్పంతోనే మొదలు..!
ఏపీలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ కు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు
మాజీ సీఎం వైఎస్ జగన్..రూ.1750 కోట్ల ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూడటం, వీటిపై అక్కడి కోర్టుల్లో అభియోగాలు నమోదు కావడం జరిగిపోయాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం తరపున విచారణ జరిపే విషయంలో మల్లగుల్లాలు పడుతున్న సీఎం చంద్రబాబు.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో సౌర విద్యుత్ కొనుగోళ్ల కోసం గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భారీ మొత్తం చేతులు మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సీఎం చంద్రబాబు ఇవాళ సౌర విద్యుత్ ప్రాజెక్టులపై సమీక్షించారు. పీఎం సూర్య ఘర్, కుసుమ్ వంటి ప్రాజెక్టులపై చర్చించిన చంద్రబాబు.. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా తన నియోజకవర్గం కుప్పంలో 100 శాతం సౌర విద్యుత్ ఇచ్చే పైలట్ ప్రాజెక్టు కూడా ఉంది.
రాష్ట్రంలో వంద శాతం సోలార్ విద్యుత్ సరఫరా కోసం తన నియోజకవర్గం కుప్పంలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలో ఇది కార్యరూపం దాల్చనుంది. దీంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు సౌర విద్యుత్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.ఇందుకోసం సౌర విద్యుత్ పరికరాల ఏర్పాటుపైనా చంద్రబాబు అధికారులతో చర్చించారు. వీటితో పాటు సోలార్ విలేజ్ పథకంపైనా అధికారులకు పలు సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications