మిగులు నీటిపై ఎన్టీఆర్ ప్రాజెక్టులు, వైయస్ ఇలా: బాబు
హైదరాబాద్: కృష్ణానది మిగులు జలాలపై ఆధారపడి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రాజెక్టులు చేపట్టారని, ఇప్పుడు మిగుల జలాలపై హక్కు లేదని చెప్పడం వల్ల తీవ్రం నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని తెలుగుదేశ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మిగులు జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టులు ఆగిపోతే ముడుపులు రావనే భయంతో మిగులు జలాలు అవసరం లేదని మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి లేఖ ఇచ్చారని ఆయన చెప్పారు
వైయస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన లేఖనే ఇప్పుడు డెత్ సర్టిఫికెట్‌గా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తగినంత నీరు లేకున్నా కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో కమిషన్ల కోసం ప్రాజెక్టులు చేపట్టారని ఆయన అన్నారు. 32 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులకు మిగులు జలాలు అవసరం లేదని వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పినట్లు ఆయన గుర్తు చేసారు.

ఆల్మట్టి ఎత్తు పెంచితే జరిగే నష్టంపై తమ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపించిందని, దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడే తాము వాదించామని ఆయన చెప్పారు. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు సరిగా చెప్పలేకపోయారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాలు వెనకబడిన ప్రాంతాలనే విషయం బ్రిజేష్ కుమార్‌కు తెలియదా అని ఆయన అడిగారు.
బ్రిజేష్ కుమార్ తీర్పు వల్ల రైతులు చితికిపోయే పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు. తుంగభద్రలో మనకు 132 టిఎంసిల కేటాయింపు ఉండగా, పూడిక వల్ల 102 టిఎంసిలు మాత్రమే వాడుతున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications