నా వల్లే టీ, నా వల్లే ఏపీ: బాబు ధీమా, ఛాన్స్‌కోసం జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు గతంలోని తన పాలననే ఆయన ఉదాహరణగా చూపిస్తున్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణకు రెవెన్యూ మిగులుకు కారణం తానేనని బాబు చెబుతున్నారు. ప్రస్తుతం రెవెన్యూ లోటులో ఉన్న ఏపీని కూడా గాడిలో పెడతానని ఆయన ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు.
చంద్రబాబు బుధవారం ఆర్థిక పరిస్థితి పైన శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సమయంలో ఆయన గత కాంగ్రెసు పాలన పైన మండిపడ్డారు. కాంగ్రెసు పాలనలో దేశం, రాష్ట్రం పరిస్థితి దిగజారితే.. పద్ధతి లేని విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దిగజారిందని ఆయన చెప్పారు. ఏపీని అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తానని, అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని చెప్పారు.
యూపిఏ హయాంలోనే ప్రజల పైన పన్నుల భారం పడిందని, మళ్లీ పన్నులు పెంచే ఆలోచన తనకు లేదని ఊరటనిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. మౌలిక వసతులు వినియోగించుకొని ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు.

నాటి పాలనతో తెలంగాణకు... బాబును చూసి ఏపీకి
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు చెబుతున్నారు. సాఫ్టువేర్ రంగంలో హైదరాబాదును ముందుకు తీసుకు పోయింది చంద్రబాబే అని గుర్తు చేస్తున్నారు. అలాగే పరిశ్రమలను కూడా ఆయన ప్రోత్సహించారని చెబుతున్నారు. బాబు సుపరిపాలన వల్లనే తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉందంటున్నారు.
నాటి చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, రాజధాని కాబట్టి నాటి తమ ప్రభుత్వం హైదరాబాదు పైన ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ కారణంగానే తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉండి సేఫ్ సైడ్‌లో ఉందని, హైదరాబాదు అభివృద్ధిని చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు ఇప్పుడు ముందుకు రావడానికి కూడా పరోక్షంగా నాటి చంద్రబాబు పాలన కూడా ఒక కారణమని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
సమైక్య రాష్ట్రం వలే నేటి ఏపీ రాష్ట్రాన్ని కూడా చంద్రబాబు అభివృద్ధి చేయగలరని గట్టిగా విశ్వసిస్తూ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతున్నారు. హామీలు నెరవేర్చుతూ, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అదును చూస్తున్న జగన్
మరోవైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చంద్రబాబును ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా ఆ పార్టీ రైతు రుణమాఫీని అస్త్రంగా వినియోగించుకునే ప్రయత్నాలు చేస్తోంది. రుణమాఫీ కష్ట సాధ్యమైనదని భావిస్తున్న ఆ పార్టీ మొదటి నుండి ఈ విషయంలో బాబు ఒక్క తప్పటడుగు వేసినా అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలో రుణమాఫీ కాకుండా రైతుల రీషెడ్యూల్ అంశం రావడం ఆ పార్టీకి విమర్శించేందుకు అస్త్రం దొరికింది. రుణమాఫీ సాధ్యమయ్యే హామీ కాదని జగన్ పార్టీ మొదటి నుండి చెబుతోంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రీషెడ్యూల్ అంటుండటంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిప్పులు చెరుగుతోంది.
చంద్రబాబు రుణమాఫీ విషయంలో ప్రజలకు నేరుగా స్పష్టత ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని, రీషెడ్యూల్‌తో రైతులను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తోంది. రీషెడ్యూల్‌తో రైతులకు మరింత భారం తప్ప వచ్చే ప్రయోజనమేమీ లేదన్నారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కాంగ్రెసు పార్టీ కూడా జత కలిసింది.












Click it and Unblock the Notifications