మళ్లీ కత్తి నూరుతోన్న టెక్ జెయింట్.. !!
ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటైన టెక్ దిగ్గజం.. మలివిడత లేఆఫ్స్ పై దృష్టి సారించింది. సెప్టెంటర్ మొదటి లేదా రెండో వారంలో మరో విడతలో భారీగా టెక్కీలను తొలగించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే 21,000 మందిని తొలగించిందా సంస్థ. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వరుస లేఆఫ్స్ చోటు చేసుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది కూడా 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసిందీ సంస్థ.
ఒరాకిల్.. మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా లేఆఫ్స్ లిస్టును కూడా ప్రిపేపర్ చేయాలంటూ వివిధ విభాగాల మేనేజర్లను యాజమాన్యం ఆదేశించినట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్న తరుణంలో తాజా లేఆఫ్స్ కు తెరతీసింది. దీనిపై బిజినెస్ ఇన్ సైడర్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

సెప్టెంబర్ 1 కంటే ముందే ఈ లేఆఫ్స్ ప్రక్రియ పూర్తి కావచ్చని ఈ కథనం పేర్కొంది. కొన్ని కీలక విభాగాలలో రెండంకెల వరకు ఉద్యోగాల కోత పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఐటీ దిగ్గజ సంస్థలో సుమారు 1,41,000 మంది సిబ్బంది పని చేస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు 13 శాతం తక్కువ కావడం గమనార్హం. అంటే.. ఈ ఏడాది కాలంలో 21,000 మంది టెక్కీలను ఉద్యోగాల నుంచి తొలగించినట్టయింది.
క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ఒరాకిల్ తన వ్యాపార కార్యకలాపాలను వేగంగా విస్తరింపజేస్తోంది. ఇందుకోసం సంస్థ భారీగా పెడుతున్న పెట్టుబడులే ఈ తాజా లేఆఫ్స్‌కు దారితీసిందనే అంచనాలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాన్ని విస్తరించడానికి ఒరాకిల్ దాదాపు 55.7 బిలియన్ డాలర్ల మూలధన పెట్టుబడుల కోసం నిధులను కేటాయించింది.
భవిష్యత్ అవసరాల కోసం మరింత రుణాన్ని కూడా సేకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మరోవైపు ఈ భారీ పెట్టుబడుల కారణంగా ఒరాకిల్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ రెవెన్యూ గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ విభాగంలో ఏకంగా 77 శాతం వృద్ధి రేటు నమోదైంది. అయినప్పటికీ.. ఏఐలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోండటం, క్యాష్ ఇన్ ఫ్లో ఖర్చులు సంస్థ ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు చెబుతున్నారు.













Click it and Unblock the Notifications