మామూలే, నాయకుల్ని నమ్మను: టిడిపిలో చేరడంపై కొడాలి, అసభ్యకర భాష అని చైర్మన్
విజయవాడ: గుడివాడ మున్సిపల్ చైర్మన్, మరో తొమ్మిది మంది కౌన్సెలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆదివారం నాడు స్పందించారు. తన రైడ్ హ్యాండ్ టిడిపిలోకి వెళ్లడాన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు.
అధికార పార్టీలోకి వెళ్లడం సహజమేనని కొడాలి నాని ఈ రోజు వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెరవేర్చడం లేదని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పటి దాకా చేయలేదని ధ్వజమెత్తారు.
చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరదని తేల్చి చెప్పారు. తాను ప్రజలను నమ్ముతానని అన్నారు. కానీ నాయకులను కాదన్నారు. ప్రజలే తనకు దేవుళ్లు అని చెప్పారు. తన ప్రాణం ఉన్నంత వరకు గుడివాడలో వైసిపి జెండా ఎగురుతుందని చెప్పారు.

కాగా, గుడివాడ చైర్మన్ యలపర్తి శ్రీనివాస రావు, తొమ్మిది మంది కౌన్సెలర్లు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యలపర్తి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కొడాలి నాని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడలు నచ్చకనే తాను ఆ పార్టీని వీడానని చెప్పారు. వారి వ్యవహారశైలి తనకు నచ్చలేదన్నారు.
కొడాలి నాని అసభ్యకరమైన భాష, తీరు వల్లే తాను సైకిల్ ఎక్కానని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పడుతున్న కష్టం చూసి పార్టీలో చేరానని అన్నారు.












Click it and Unblock the Notifications