తుపానును అలా ఎదుర్కొన్నాం..! సీఎం వెల్లడి-ఫేక్ పోస్టులపై ఫైర్..!
ఏపీని భయపెట్టిన మొంథా తుపానును ఆపలేకపోయినా, టెక్నాలజీ సాయంతో దాని ప్రభావాన్ని ఎలా తగ్గించారో సీఎం చంద్రబాబు ఇవాళ వెల్లడించారు. తుపాను ప్రభావం తగ్గిన నేపథ్యంలో పంటలు, ఆస్తుల నష్టాన్ని అంచనా వేస్తున్న ప్రభుత్వం కేంద్రానికి నివేదికలు పంపేందుకు సిద్దమవుతోంది. దీంతో సీఎం చంద్రబాబు అసలు తుపానును ప్రభుత్వం ఎలా ఎదుర్కొందో, దాని ప్రభావం ఎలా తగ్గించగలిగిందో ప్రెస్ మీట్ పెట్టి వివరించారు.
టెక్నాలజీ సాయంతో తుఫాన్ ప్రభావంతో కలిగే నష్టాన్ని తగ్గించగలిగామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేశాయని ఆయన తెలిపారు. మొదటి రోజునే పరిస్థితులను చాలా వరకూ చక్కదిద్దామన్నారు.
ఎప్పటికప్పుడు తుఫాన్ పై సమీక్షలు నిర్వహించామని వెల్లడించారు. అంతర్వేది దగ్గర తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయన్నారు.

శాటిలైట్ ఇమేజ్ ల ఆధారంగా తుఫాన్ పరిస్థితిని అంచనా వేశామని, ప్రిపరేషన్, ముందస్తు ప్రణాళికల వల్ల ప్రకృతి వైపరీత్య నష్టాన్ని బాగా తగ్గించామని సీఎం చంద్రబాబు తెలిపారు. వర్షాలు, గాలుల తీవ్రతను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసి చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో తుఫాన్ ప్రభావం తగ్గిన వారం రోజుల వరకూ కోలుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు. తుఫాన్లు, వర్షాలను ఆపలేం కానీ అప్రమత్తత, ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉందన్నారు.
తుఫాను ప్రభావం ఉన్న అన్ని ప్రాంతాల్లో టెక్నాలజీ వినియోగించి నష్టాలను తగ్గించగలిగామని సీఎం వెల్లడించారు. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రవాహాలు పెద్ద ఎత్తున వస్తాయి అనేది అంచనా వేసి ముందస్తు గా హెచ్చరిక లు ఇచ్చామన్నారు. తుఫాన్ కారణంగా దాదాపు రూ.5,265 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా, రహదారులు రూ.2079 కోట్లు, విద్యుత్, జలవనరుల విభాగం లో రూ.207 కోట్లు నష్టం జరిగిందన్నారు.

గతంలో గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకు పోయినా పట్టించుకోలేదని, తుఫాన్ నష్టాలను పూర్తి స్థాయిలో అంచనా వేసి కేంద్రానికి పంపిస్తామని చంద్రబాబు తెలిపారు. రియల్ టైమ్ లోనే డేటా లేక్ ద్వారా సమాచారం విశ్లేషించి త్వరగా నిర్ణయాలు తీసుకోగలిగామన్నారు. తుపాను నష్ట తీవ్రత తగ్గించే అంశంపై మంత్రులు క్షేత్ర స్థాయిలో, ఆర్టిజీఎస్ నుంచి మంత్రి లోకేష్, అనిత ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నారు. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారన్నారు. టెక్నాలజీ వినియోగించి పంట నష్టాలు, ముంపు ప్రాంతాలు తదితర అంశాలను కూడా గుర్తిస్తామని తెలిపారు. ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూస్తుంటే కొందరు ఫేక్ పోస్టులు పెడుతున్నారని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం కూడా వారికి ఇష్టం లేనట్టు ఉందన్నారు.












Click it and Unblock the Notifications