ఊళ్లో పట్టు పంచెలో చంద్రబాబు, నెక్లెస్ రోడ్డులో దత్తాత్రేయ
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు బుధవారం వేడుకల్లో పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా గత రాత్రి స్వగ్రామానికి చేరుకున్న చంద్రబాబు ఈ ఉదయం తన ఇంటి వద్ద ఏర్పాటు చేసి భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగ పర్వదినాన చంద్రబాబు పట్టుపంచెలో మెరిసిపోయారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, గ్రామస్థులతో గడిపారు.

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు, ఆయనను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. అంతకుముందు చంద్రబాబు అక్కడి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తల్లిదండ్రుల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.
చంద్రబాబు దంపతులు నారా రోహిత్ హీరోగా నటించిన 'పండుగలా వచ్చాడు' చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబసభ్యులు నారా లోకేష్, భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, పలువురు నేతలు పాల్గొన్నారు.
నెక్లెస్ రోడ్డులో పతంగుల ఉత్సవాలు
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో పతంగుల ఉత్సవాలను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications