చంద్రబాబు అనుమానం: కావాలనే మోడీ చిక్కుల్లోకి నెడుతున్నారా?
విజయవాడ: రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాపై, కేటాయించాల్సిన నిధులపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తనను కావాలనే చిక్కుల్లోకి నెడుతుందా అనే అనుమానాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఎంత కష్టపడినా రెండు మూడు శాతానికి మించి ఆదాయాన్ని పెంచుకోలేకపోయామని లెక్కలతో ఇటీవల జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలోో ఆయన అన్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఎపిపై దృష్టి పెట్టలేకపోవడం వల్ల సాయం చేయడానికి ముందుకు రావడం లేదా, కావాలనే నిర్లక్ష్యం చేస్తుందా అనేది తెలియడం లేదని ఆయన అన్నట్లు చెబుతున్నారు.
ఇవ్వాల్సినవి ఇవ్వకపోవటం, సరిగా స్పందించకపోవటం వంటి కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి వల్ల ఇబ్బంది పడుతున్నామని, తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో టిడిపి నేతలు కేంద్ర ప్రభుత్వంపై, బిజెపిపై కాస్తా ఘాటుగానే స్పందిస్తున్నారు.

బిజెపి తీరుపై, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై తెలుగుదేశం పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి పొలిట్‌బ్యూరోలో నాయకులు అసంతృప్తి స్వరం వినిపించారు. ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని కొంత మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ స్థితిలో కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిందేనని పొలిట్‌బ్యూరో నిర్ణయానికి వచ్చింది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి చెప్పిన తర్వాత ప్రజల్లో భావోద్వేగాలు పెరిగిపోయాయని, అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని పోలిట్‌బ్యూరో అభిప్రాయపడింది.
ఈ నెల 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో నిర్వహించే మహానాడులో రాజకీయ తీర్మానాన్ని ఆమోదించాలని కూడా పొలిట్‌బ్యూరోలో నిర్ణయించారు. తెలంగాణ ప్రాజెక్టులపై కూడా ధీటుగా స్పందించాలని భావిస్తున్నారు. ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్ష నేత జగన్ వ్యవహరిస్తున్న తీరుపై కూడా టిడిపి పోలిట్‌బ్యూరో సమావేశంలో నాయకులు మండిపడ్డారు.
కాగా, ఈలోగానే రాజమండ్రిలో స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేంద్రం సాయంపై ఘాటుగా స్పందించారు. కేంద్రాన్ని పదే పదే కోరుతున్నప్పటికీ ఎటువంటి సాయం చేయటం లేదని, తెలుగువారి దెబ్బ ఏమిటో ఇప్పటికే ఇందిరాగాంధీ, సోనియాగాంధీలకు తెలిసిందని, సాయం చేయకపోతే మోదీకి కూడా త్వరలోనే తెలిసివస్తుందని వ్యాఖ్యానించారు.
దీనిపై బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రి పదవి కోసం బుచ్చయ్య చౌదరి బీజేపీ నేతలను విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ స్థితిలో బిజెపి, టిడిపిల మధ్య స్నేహం ఎంతో కాలం సాగదనే ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications