కేంద్రం ఇచ్చిన ఆ నివేదికపై సీఎం జగన్ సమాధానం చెప్పగలరా? చంద్రబాబు సూటిప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఎన్నికలు రాక ముందే పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని అందుకే ప్రజల వద్దకు ధైర్యంగా వెళుతున్నామని వైసిపి నేతలు చెబుతుంటే ఏపీలో ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఏం అభివృద్ధి చేశారు చూపించాలని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
అటు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో ప్రజా క్షేత్రంలోకి వెళుతూ వైసిపి వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా మరో అంశాన్ని టార్గెట్ చేసిన టిడిపి అధినేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు విషయంలో అధికార వైసీపీని టార్గెట్ చేశారు. గత మూడు సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు పనులు నత్తకు నడకలు నేర్పించినట్లుగా సాగుతున్న తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

ప్రచార ఆర్భాటం తప్ప అక్కడ పనులు ఏమీ జరగలేదని చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో తాము చెప్పడం కాదు కేంద్రమే నివేదిక ఇచ్చిందని పేర్కొన్న చంద్రబాబు దీనికి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏడాదిలో 0.83 శాతం పనులు మాత్రమే జరిగాయి అన్న కేంద్ర జల శక్తి శాఖ నివేదికపై సీఎం జగన్ సమాధానం చెప్పగలరా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. కూల్చే వారికి కట్టడం ఎలా తెలుస్తుంది అంటూ మండిపడ్డారు విధ్వంసకారులకు విధానం ఏముంటుంది అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన ఆయన ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని ప్రజలు సరిపెట్టుకోవాలా? అంటూ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications