ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్..! అసెంబ్లీలో టైమ్, కండిషన్స్ ఫిక్స్..!
ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగం జరిగింది. బడ్జెట్ తో పాటు దానిపై చర్చ, ఇతర అంశాలు కలిపి మార్చి 7 వరకూ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన ఎన్డీయే శానససభాపక్ష భేటీలో సీఎం చంద్రబాబు (Chandrababu) ఎమ్మెల్యేలకు కీలక హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్న సీఎం.. వారికి టైమింగ్స్ తో పాటు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలో 40 మంది ఎమ్మెల్యేలను పిలిపించుకుని, వారి పనితీరుపై మాట్లాడతానని చంద్రబాబు వారికి తెలిపారు. కాబట్టి ఆవుకథలు చెప్పకుండా, పలు అంశాలపై ప్రిపేర్ అయి సభకు రావాలని సూచించారు. అలాగే సభలో ఎవరేం మాట్లాడుతున్నారో తాను నోట్ చేసుకుంటానని కూడా తెలిపారు. అలాగే అసెంబ్లీకి ఉదయం 8.30కు వచ్చాక మధ్యాహ్నం 2 గంటల వరకూ కచ్చితంగా ఉండాల్సిందేనని ఎమ్మెల్యేలకు బాబు తేల్చిచెప్పేశారు. తానూ 11 గంటల కల్లా ఉంటానన్నారు. సభలో ప్రజలకు జవాబుదారీగా మాట్లాడాలని, చెప్పే విషయం 3-7 నిమిషాల్లో పూర్తి చేయాలని కూడా సూచించారు.

అలాగే అసెంబ్లీలో కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు అర్దమయ్యేలా వివరించాలని కూడా ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం లక్ష కోట్లకు పైగా జాతీయ రహదారుల పనులు, 90 వేల కోట్లకు పైగా రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. 450 కోట్ల నష్టంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను 54 కోట్ల లాభంలోకి తెచ్చిన విషయం కూడా ప్రస్తావించాలన్నారు. అలాగే లడ్డూ నెయ్యి వివాదంపైనా ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఎన్డీయే ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు.












Click it and Unblock the Notifications