జేసీబీని నడిపి, మట్టి తవ్విని చంద్రబాబు: నా ఒక్కడి వల్ల కాదని..
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని బి కొత్తకోట మండలం గుమ్మసముద్రం చెర్వులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు నీరు - చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బెంగళూరు నుంచి చిత్తూరు చేరుకున్న ఆయన ముందుగా హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించారు.
అనంతరం నీరు - చెట్టు పైలాన్ ప్రారంభించారు. పొక్లెయినర్‌తో బాబు మట్టిని తవ్వారు. ఆయన జేసీబీని నడుపుతూ నీరు - చెట్టు కార్యక్రమం ప్రారంభించారు. ఆ తర్వాత ఉపాధి హామీ కూలీలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
పదేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజల కష్టాలను పట్టించుకోలేదన్నారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, పూడికతీతతో భూగర్భ జలమట్టం పెంచుకోవాలన్నారు. సముద్రంలో వృథాగా పోతున్న నీటిని వాడుకునేందుకు వీలుగా నదులను అనుసంధానం చేయాల్సిన అవసరముందన్నారు.

సాగునీరిస్తే బంగారం పండించవచ్చన్నారు. ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలకు, రాయలసీమకు నీరిచ్చే బాధ్యత తాను తీసుకుంటున్నానన్నారు. నీరు - చెట్టు పవిత్ర కార్యక్రమం అన్నారు. రైతాంగానికి సాంకేతిక పరిజ్ఞానం తాము నేర్పించామని చెప్పారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నీరు - చెట్టుకు అందరు తోడ్పడాలన్నారు. తన ఒక్కడితోనే ఇది కాదని, ఐదు కోట్ల మంది ప్రజలు నీరు - చెట్టు కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications