బాబు ఐడియా: ప్రభుత్వం చేతుల్లోకి వైన్ షాపులు?
హైదరాబాద్: ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని, మొత్తం మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొత్త ఆబ్కారీ విధానంపై సోమవారం అధికారులతో సమీక్షించారు. మొత్తం మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించే వీలుందేమో పరిశీలించాలని అధికారులను కోరారు. అవసరమైతే అన్ని దశల్లో ఐటిని వాడుకుందామని సూచించారు.
నూతన ఎక్సైజ్ పాలసీపై నిర్ణయం తీసుకునేముందు కొత్త విధానంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరపాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఆదాయ పెంపే ప్రాతిపదిక కాకూడదని, ప్రజారోగ్యాన్నీ దృష్టిలో ఉంచుకోవాలన్నారు.
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ఎక్సైజ్ విధానంపై సిఎం అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమిళనాడులో ప్రభుత్వమే స్వయంగా మద్యం అమ్మకాలు సాగిస్తోందని, కేరళలో సహకార పద్ధతిలో మద్యం అమ్మకాలు కొనసాగిస్తోందని చెప్పారు. ఏపీలో కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించే ముందు భౌగోళికంగా మన రాష్ట్రంతో పోల్చదగిన కర్నాటకలోని విధానం ఎలా ఉందో పరిశీలించాలని సిఎం సూచించారు.

మిగిలిన రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న విధానంపై ప్రజల్లో చర్చ జరిగిన తర్వాత వారి అభిప్రాయాలను అనుసరించి ప్రభుత్వమే అమ్మడమా? లేదా ఇతర విధానాలు అమలు చేయడమా? అనే అంశంపై వారం పదిరోజుల్లో నిర్ణయం తీసుకుందామని చెప్పారు. తాటి చెట్టు తరహాలో కొబ్బరి చెట్లు నుండి నీరా తీసే విధానం కేరళలో అమలవుతోందని ఆయన గుర్తు చేశారు. మద్యానికి ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగించడం వల్ల ప్రజారోగ్యం మెరుగుపడటమేకాక, కల్తీ కల్లు విక్రయాలు అరికట్టినట్ట అవుతుందని సిఎం వివరించారు.
ఈ విధానాన్ని తమ రాష్ట్రంలో కొబ్బరి తోటలు విస్తృతంగా ఉన్న కోనసీమ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. ఫార్మా కంపెనీల్లో విరివిగా ఉపయోగించే ఇథనాల్, మిథనాల్ వంటి స్పిరిట్‌ల సరఫరాపై పన్ను విధించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచే అవకాశాలను అధికారులు పరిశీలించాలని సిఎం సూచించారు.
మద్యం షాపుల్లో విక్రయాలను పర్యవేక్షించేందుకు సిసి కెమరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సమావేశంలో అధికారులను ఆదేశించారు. దీనివల్ల నేరాలు తగ్గుముఖం పడుతాయన్నారు. లిక్కర్ సప్లయి చెయిన్ సిస్టమ్‌లో ఆర్‌ఎఫ్‌ఐడి హాలోగ్రామ్, బార్ కోడింగ్‌వంటి వాటిని ఉపయోగించి విక్రయాల వ్యవస్థను రెగ్యులర్ చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
లిక్కర్ వాహనాలల్లో జిపిఎస్ సిస్టమ్ వినియోగించాలని, సివిల్ సప్లయి శాఖలో ఇపోస్ విధానం అమలు, ఎలక్ట్రానిక్ యంత్రాలను వినియోగిస్తున్నట్టే లిక్కర్ విక్రయాల్లోనూ ఆధునిక సాంకేతికత ఉపయోగించుకోవాలని సూచించారు. గోదావరి , ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్న గాంజా విక్రయాలను అరికట్టాలని సిఎం సూచించారు.












Click it and Unblock the Notifications