రాజధాని బిల్లుల రద్దు అందుకే ? చంద్రబాబు ఎపిసోడ్ డైవర్ట్- మరో బిల్లు పెట్టినా, పెట్టకపోయినా ?
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన రెండు బిల్లుల్ని నిన్న శాసనసభలో ఉపసంహరించుకుంది. వీటి స్ధానంలో మరో కొత్త బిల్లు తీసుకొస్తామని ప్రకటించింది. అయితే ఇంత సడన్ గా ఎందుకు వైసీపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందన్న చర్చ రాష్ట్రంలో సాగుతోంది. వాస్తవానికి అసెంబ్లీ బీఏసీ సమావేశంలో కానీ, మరెక్కడా కానీ ఈ అంశం సర్కార్ అజెండాలో లేదు. అయినా గంటల వ్యవధిలో తీసుకున్న నిర్ణయాలతో బిల్లులు రద్దయిపోయాయి. దీంతో దీని వెనుక ఉన్న అసలు కారణం అదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రాజధానుల బిల్లుల రద్దు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుల్ని గతంలోనే అసెంబ్లీలో తమకున్న మెజారిటీతో నెగ్గించుకుని మండలి ఆమోదం లేకపోయినా వాటికి గవర్నర్ ముద్ర వేయించేసుకుంది. అయితే ఈ వ్యవహారం న్యాయస్ధానాల్లో ఇప్పటికే కలకలం రేపుతోంది. దీనిపై కోర్టు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా పోతోంది. అదే సమయంలో మరిన్ని అంశాలు కూడా దీనికి తోడవడంతో రాజధాని బిల్లుల రద్దు వ్యవహారం అకస్మాత్తుగా తెరపైకి వచ్చేసింది. దీంతో ప్రభుత్వం నిన్న హైకోర్టుకు ఈ బిల్లులు అసెంబ్లీలో ప్రభుత్వం ఉపసంహరించేసుకుంటుందని చెప్పేయడం, అనంతరం మధ్యాహ్నం ఉపసంహరించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఎందుకు ఈ ప్రయత్నం చేశారనే దానిపై వివరణ ఇచ్చుకునేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

బిల్లుల రద్దు ఎందుకంటే
రాజధాని బిల్లుల రద్దుకు ప్రభుత్వం చెప్పిన ప్రధాన, ఏకైక కారణం అమరావతిలో ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఒకటో, అర శాతమో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది కాబట్టి వీటిని వెనక్కి తీసుకుంటున్నామని, తిరిగి వారిని కూడా ఒప్పించి మరో బిల్లు పెడతామని ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పుకొచ్చింది. అయితే ఈ కారణం ఏమాత్రం సమంజసంగా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు తీసుకునే ప్రతీ నిర్ణయానికీ కనీసం 10-20 శాతం వ్యతిరేకత ఎలాగో తప్పదు. చాలాసార్లు అంతకుమించిన వ్యతిరేకత కూడా తప్పదు. అంతెందుకు అమరావతిలో రాజధాని ఏర్పాటును అప్పట్లో దాదాపు సగం మంది వ్యతిరేకిస్తున్నారని వైసీపీయే చెప్పుకునేది. కానీ ఇప్పుడు అమరావతిలో ఒక శాతం వ్యతిరేకతను అధిగమించేందుకు బిల్లులు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు.

న్యాయపరమైన చిక్కులు
రాజధాని బిల్లుల్ని అసెంబ్లీలో ఆమోదించుకున్న తర్వాత మండలి నేరుగా ఆమోదించకపోయినా గవర్నర్ నుంచి ఆమోదం తీసుకున్న వైసీపీ సర్కార్ వాటికి రాజముద్ర వేసేసుకుంది. కానీ ఆ తర్వాత న్యాయస్ధానాల్లో పిటిషన్లు దాఖలు కావడంలో ఇబ్బందులు పడుతోంది. అయినా న్యాయస్ధానాల్ని సైతం ఒప్పిస్తామని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడు హైకోర్టులో తుది విచారణ ప్రారంభమై వారం రోజులు కూడా కాకముందే ఈ బిల్లుల్ని వెనక్కి తీసేసుకుంది. వాస్తవానికి హైకోర్టు రాజధానుల పిటిషన్లపై విచారణ పూర్తి చేయడానికి కనీసం తక్కువలో తక్కువ ఆరు నెలలైనా పడుతుంది. అద్భుతాలేవైనా జరిగినా రెండు మూడు నెలలైనా పడుతుంది. అప్పుడు ప్రతికూల తీర్పు వస్తుందేమోనని భయపడి ఈ బిల్లులు ముందే వెనక్కి తీసుకున్నారా అంటే అదీ సరైన వాదనగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇంతకంటే తీవ్రమైన వ్యవహారాల్లోనే ప్రస్తుతం హైకోర్టులో ప్రభుత్వం పోరాడుతోంది.

చంద్రబాబు ఎపిసోడ్ డైవర్షన్
ప్రభుత్వం ఆఫ్ ద రికార్డ్ లో చెబుతున్న న్యాయపరమైన, సాంకేతిక చిక్కులు ఉన్నాయన్న కారణంతో ఈ బిల్లులు ఉపసంహరించుకుందా అంటే కచ్చితంగా అవునని బహిరంగంగా చెప్పలేని పరిస్ధితి. దీంతో అమరావతి రైతుల్ని ఒప్పించి మరో బిల్లు ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్పుకుంది. ఈ వాదన కూడా తేలిపోవడంతో ఇప్పుడు అసలైన కారణం ఇదేనన్న చర్చ సాగుతోంది. ఆ కారణం చంద్రబాబు కన్నీళ్ల ఎపిసోడ్. చంద్రబాబునూ, ఆయన సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అనుచితంగా దూషించడం ప్రజల్లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. మంత్రులు కొడాలి నాని, పేర్నినాని వంటి వారితో వివరణ ఇప్పించేందుకు ప్రయత్నించినా, చంద్రబాబు గ్లిజరిన్ వేసుకుని కన్నీళ్ల డ్రామా ఆడారని చెప్పించినా ప్రజలు నమ్మలేదు. దీంతో చంద్రబాబు కన్నీళ్లు ఎపిసోడ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.

గత్యంతరం లేకే తీవ్ర నిర్ణయం
చంద్రబాబు ఎపిసోడ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ ప్రభుత్వం వద్ద సరైన అస్త్రం లేకుండా పోయింది. మంత్రులు, లక్ష్మీపార్వతి సాయంతో చంద్రబాబుపై ఈ విషయంలో ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించినా జనం వైసీపీ చర్యల్ని జీర్ణించుకోలేదని అర్ధమైపోయింది. దీంతో అంతకుమించిన విషయాన్ని తెరపైకి తెస్తే కానీ దీన్నుంచి జనం దృష్టి మరల్చడం కష్టమని ప్రభుత్వం నిర్ణయించేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంత హడావిడిగా రాజధానుల బిల్లుల రద్దు అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు అర్ధమవుతోంది. ప్రభుత్వం చెప్తున్నట్లు అమరావతి రైతుల్ని ఒప్పించడానికో, సాంకేతిక సమస్యల కారణంగానో అయితే ఇంత అర్జంటుగా ఈ బిల్లుల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వానికి చంద్రబాబు ఎపిసోడ్ ను డైవర్ట్ చేసేందుకు మరో గత్యంతరం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

తర్వాత ఏం జరగబోతోంది ?
చంద్రబాబు ఎపిసోడ్ డైవర్షన్ కోసం మూడు రాజధానుల బిల్లుల్ని ఏదో రకంగా అసెంబ్లీ నుంచి ఉపసంహరించేసుకున్నారు సరే. కానీ ఇప్పుడు ఏం జరగబోతోందన్న ప్రశ్నలు జనాల మెదళ్లను తొలిచేస్తున్నాయి. అసెంబ్లీలో బిల్లుల ఉపసంహరణ నేపథ్యంలో కొత్త బిల్లు రూపకల్పన చేయకతప్పదు. అందులో ప్రభుత్వ వాదన ప్రకారం అమరావతి రైతుల్ని మెప్పించేందుకు తాయిలాలు ప్రకటించక తప్పదు. అలాగే కొత్త బిల్లుకు మద్దతుగా మరిన్ని వాదనలు సిద్ధం చేసుకోక తప్పదు. ప్రభుత్వంలో మంత్రులు చెప్తున్న ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణా తప్పదు. ఇందుకోసం మరో సర్వే సంస్ధనో, మరో విభాగాన్నో ఆశ్రయించక తప్పని పరిస్ధితి. ఇన్ని జరిగి మరో బిల్లు ప్రవేశపెట్టాలన్నా వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వరకూ ఆగక తప్పదు. అలా బడ్డెట్ సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెట్టి అసెంబ్లీ, మండలిలో నెగ్గించుకున్నా చివరికి మళ్లీ హైకోర్టులో వాటికి వ్యతిరేకంగా పిటిషన్లూ ఎలాగో తప్పవు. వీటిని కూడా ఎదుర్కోక తప్పదు. దీంతో ప్రభుత్వానికి ఏ విధంగా చూసినా ముందునుయ్యి, వెనుక గొయ్యి పరిస్ధితి దాపురిస్తోంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications