బాబు ఫ్యాక్టర్: బిజెపిలో నాగంకు తగ్గిన ప్రాధాన్యం?
హైదరాబాద్: బిజెపిలో సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డికి ప్రాధాన్యం తగ్గినట్లు ప్రచారం సాగుతోంది. బిజెపి నాయకత్వం ఆయనను దూరంగా పెడుతున్నట్లు చెబుతున్నారు. గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో నిర్మించ తలపెట్టిన వల్లబ్ భాయ్ పటేల్ ఏకతా విగ్రహం లక్ష్యంగా జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు నాగం జనార్దన్ రెడ్డికి ఆహ్వానం అందలేదు.
నాగం జనార్దన్ రెడ్డిని పక్కన పెట్టడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అంశమే కారణమని అంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శానససభ్యుడు యెన్నం శ్రీనివాస రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యం కూడా నాగం జనార్దన్ రెడ్డికి ఇవ్వడం లేదని అంటున్నారు. నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ప్రధానమైన నాయకుడిగా ఉంటూ తెలంగాణపై చంద్రబాబుతో విభేదించి బయటకు వచ్చారు. ఆ తర్వాత కొంత కాలం తెలంగాణ నగారా సమితి పేరు మీద పనిచేశారు.

నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారని ప్రచారం ముమ్మరంగా సాగింది. అయితే, ఆయన బిజెపిలో చేరారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాకుండా తెలంగాణలో కూడా నాగం జనార్దన్ రెడ్డి ముఖ్యమైన నాయకుడు కావడంతో బిజెపి నాయకత్వం ఆయనను పార్టీలోకి ఆహ్వానించింది.
అయితే, తదనంతర కాలంలో చంద్రబాబు నాయుడు బిజెపికి దగ్గరవుతూ వచ్చారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో వేదికను కూడా పంచుకున్నారు. నరేంద్ర మోడీ పాలనను, గత ఎన్డీయె పాలనను చంద్రబాబు వివిధ సందర్భాల్లో ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో బిజెపి నాయకత్వం ఉందని చెబుతున్నారు.
చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నాగం జనార్దన్ రెడ్డిని పక్కన పెట్టడానికి, ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి బిజెపి నాయకత్వం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడమేనని అంటున్నారు. ఏమైనా, నాగం జనార్దన్ రెడ్డికి ఇది సంధికాలమేనని చెప్పాలి.












Click it and Unblock the Notifications