జగన్‌కు చంద్రబాబు భయపడుతున్నారు: మేకపాటి
హైదరాబాద్: సమైక్య రాష్ట్రానికి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తన దురాగతాలు బయటపడుతాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై రాజీనామాలు చేయకుండా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.
స్పీకర్ నోట్‌లో టిడిపి ఎంపీల డ్రామాలు బయపడ్డాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేయలేదనే విషయం బయటపడిందని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ముద్దాయిలని ఆయన అన్నారు. విభజన పాపంలో కాంగ్రెసు పార్టీ మొదటి ముద్దాయి కాగా, తెలుగుదేశం రెండో ముద్దాయి అని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలమా, కాదా స్పష్టం చేయాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు.
చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఎందుకు మోసం చేయాలని అనుకుంటున్నారని ఆయన అడిగారు. చంద్రబాబు సమైక్యాంధ్రను కోరుకుంటే ఇప్పటికైనా తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ ముక్కలైతే చంద్రబాబును సీమాంధ్ర ప్రజలు తరతరాలుగా ప్రశ్నిస్తారని ఆయన అన్నారు. కేంద్రం ఒంటెత్తు పోకడలను మానుకుని విభజనపై పునరాలోచన చేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications