జైలు నుంచి వచ్చిన జగన్‌కు ప్రాధాన్యమా: చంద్రబాబు
పశ్చిమగోదావరి: జైలు నుంచి విడుదలైన వ్యక్తికి జాతీయ మీడియా ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియడం లేదని, అతనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమేమిటని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పర్యటనకు వెళుతున్న ఆయన, కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. జాతీయ మీడియాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియంత్రిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని విషయాలను దేశ ప్రజలకు తెలియకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ పాలన పరాకాష్టకు చేరుకుందని, ఒక సమస్యను పరిష్కరించమంటే వంద సమస్యలను సృష్టించిందని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గృహిణిగా ఉన్న సోనియాకు రాష్ట్ర పరిస్థితులు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. పార్లమెంటు ఘటనకు కారణమైన ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆ ఘటనపై ఇంతవరకు స్పందించలేదని తెలిపారు.
తెలుగు ప్రజల మనోభావాలతో కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర విభజన చేపడితే ఇరు ప్రాంతాలకు పూర్తిగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై దేశమంతా తిరిగి రాజకీయ పార్టీలతో చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాల ముఖ్య పట్టణాల్లో ప్రజాగర్జన నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications