ఐదు రోజుల్లోనే కేంద్రం నుంచి తొలి డిమాండ్ నెరవేర్చుకున్న చంద్రబాబు ! కానీ అక్కడే చిక్కు..!
ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి సర్కార్ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి భారీ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రుల్ని కలిసి వచ్చారు. వారి ముందు చాలా డిమాండ్లు పెట్టారు. రాష్ట్రానికి ఈసారి కేంద్ర బడ్జెట్ లో లక్ష కోట్ల సాయం కూడా కోరారు. దీంతో పాటు పలు ప్రాజెక్టులు కేటాయించాలని అడిగారు. ఇందులో ఐదు రోజుల్లోనే ఓ భారీ ప్రాజెక్టుకు కేంద్రం సై అనేసింది.

సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఏపీలో బీపీసీఎల్ రిపైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కేటాయింపు కోసం చంద్రబాబు ప్రధాని మోడీ, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ ముందు డిమాండ్ పెట్టారు. గుజరాత్ తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాలు దీని కోసం పోటీ పడుతున్న తరుణంలో కేంద్రం, ఇంకా చెప్పాలంటే ప్రధాని మోడీ వాటన్నింటినీ కాదని ఏపీకి దీన్ని కేటాయించారు. దీంతో చంద్రబాబు ఏపీలో బీపీసీఎల్ ప్రతినిధులతో నిన్న చర్చలు కూడా జరిపారు.

అయితే ఇక్కడో చిక్కు ఉంది. రాష్ట్రంలో తాము అడిగిన భూమి, ఇతర సదుపాయాలు కేటాయిస్తే ఎక్కడైనా ఈ రిపైనరీ పెట్టేందుకు కేంద్రం సిద్ధంగానే ఉంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మచిలీపట్నంతో పాటు శ్రీకాకుళం, రామాయపట్నం కూడా ఉన్నాయి. ఈ మూడింటిలో ఒక చోట ఈ రిఫైనరీతో పాటు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు రూ.60 వేల కోట్లకు పైగా విలువైన ఈ ప్రాజెక్టు కోసం ఇప్పుడు రాష్ట్రంలో పోటీ నెలకొనే పరిస్దితి ఉంది.












Click it and Unblock the Notifications