చంద్రబాబు ఆర్డర్, 34 మంది తహసిల్దార్లు బదిలి, వైసీపీకి మద్దతు ఇచ్చిన అధికారులు?
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడం, గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లిపోయి ఎన్డీఏ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే తహసిల్దార్లను ఎన్నికలకు ముందు వారి పొరుగు జిల్లాలకు బదిలీలు చేసిన విషయం తెలిసిందే.
ఎన్నికల సందర్బంగా ఇన్నిరోజులు పొరుగు జిల్లాల్లో ఉద్యోగాలు చేసిన తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నాలుగురోజుల క్రితం సీసీఎల్‌ఏను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో ఇప్పటికే తహసిల్దార్లు బదిలీలు చేశారు. అయితే అన్నమయ్య జిల్లా (ఉమ్మడి చిత్తూరు జిల్లా)లోని మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం, ఆ కార్యాలయంలో రికార్డులు దగ్ధం కావడంతో తహసీల్దార్ల బదిలీలకు బ్రేక్ పడింది.

ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి శుక్రవారం రాత్రి తహసీల్దార్లను రిలీవ్ చేయాలని చెప్పడంతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ తహసిల్దార్ల బదిలీలు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న 34 మంది పొరుగు తహసీల్దార్లు ఆయా మండలాల్లోని డిప్యూటీ తహసిల్దార్లకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అవుతున్నారు. ఇక పొరుగు జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 40మంది తహసీల్దార్లు శనివారం సాయంత్రానికి కలెక్టరేట్‌లో రిపోర్టు చేయనున్నారు.
కలెక్టర ఆఫీసులో రిపోర్టు చేస్తున్న తహసిల్దార్లకు త్వరలో పలు మండలాల్లో పోస్టింగ్స్ ఇవ్వనున్నారని తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలోని ఉన్నతాధికారులు, ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నేతల నుంచి కొందరు తహసీల్దార్లు పైరవీలు మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. తమకు ప్రాధాన్యత గల మండలం కావాలని జిల్లా అధికారులపై కొందరు తహసిల్దార్లు తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారని సమాచారం.
అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను అప్పటి ఎమ్మెల్యేలకు అప్పనంగా అప్పజెప్పిన తహసీల్దార్లను దూరంగా పెట్టాలని, నిజాయితీగా పనిచేసేవారికి అవకాశం ఇవ్వాలని కూటమి నేతలు ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి చేసిన తహసిల్దార్లను ప్రాధాన్యతలేని మండలాలకు బదిలి చెయ్యాలని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది మొత్తం మీద మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు అగ్నిప్రమాదం కేసు దెబ్బతో హడలిపోతున్న కొందరు తహసిల్దార్లు తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications