పన్ను బాదుడు, కరెంట్ ఛార్జీల బదుడు.. ఆ మహిళలకు వందనం అంటూ చంద్రబాబు ట్వీట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అన్నింటి ధరలను పెంచుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వంపై ప్రజల దుమ్మెత్తిపోస్తున్నారంటూ ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు చంద్రబాబు.

ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ చంద్రబాబు
ఓ వైపు పన్నుల బాదుడు, మరోవైపు పెంచిన కరెంట్ చార్జీలపై ఎమ్మెల్యేలను సైతం నిలదీస్తున్న మహిళల ధైర్యానికి వందనమని చంద్రబాబు కొనియాడారు. తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ.. మోసం చేస్తున్న వైనంపై ప్రశ్నించిన సోదరీమణుల అవేదనకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నిలదీశారు.
ఆ మహిళలు స్ఫూర్తి అంటూ వీడియో పోస్టు చేసిన చంద్రబాబు
ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని.. తాము పడుతున్న కష్టాన్ని వివరిస్తూ ప్రశ్నించిన ఆ సోదరి తెగువ అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షిస్తూ.. అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు చంద్రబాబు. కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ పథకాల పంపిణీ సందర్భంగా.. స్థానిక మహిళలు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఓవైపు నిత్యావసరాల ధరలు పెంచుతూ.. మరోవైపు పథకాల చెక్కులు పంపిణీ చేయడం ఏంటని తిరగబడ్డారు. గూడూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సున్నా వడ్డీ మూడో విడత చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. పన్నుల భారమంటూ మహిళలు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది."నూనె ధర, గ్యాస్ ధర ఆకాశాన్నంటాయి. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం కూడా సరిగా లేవు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా.. ప్రభుత్వ పథకాలు ఎందుకు? ఈ పథకాలతో లాభాలు ఏం లేవు. ప్రజలకు కనీసం ఇల్లు కట్టించి ఇవ్వాలి. నగర పంచాయతీలో తాగడానికి కనీసం నీటిని సక్రమంగా ఇవ్వడం లేదు. ఇష్టమొచ్చినట్లు పన్నుల భారం ప్రజలపై విధిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారు' అని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.

జగన్ జేబు నుంచి ఇచ్చారా? అంటూ ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు
'జగన్ జేబు నుంచి ఇచ్చారా...అసలు దోచింది ఎంత? ఇచ్చింది ఎంత? మేము వాటితో బతుకుతున్నామా అంటోన్న ఆడబిడ్డల ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుంది? ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, తాము పడుతున్న కష్టాన్ని వివరిస్తూ ప్రశ్నించిన ఆ సోదరి తెగువ అందరికీ స్ఫూర్తి కావాలి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ సర్కారుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications