దాడి పెంచిన టిఆర్ఎస్, జగన్ పార్టీ: ఆసక్తి, బాబు ఎలా బయటపడ్తారు?
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి అంది వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆ రెండు పార్టీ మూకుమ్మడి దాడికి దిగుతున్నాయి. ఈ కేసులో రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా చంద్రబాబు కూడా చిక్కుల్లో పడ్డారు. కేసులు పెడుతామంటూ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఎవరికీ భయపడేది లేదని చంద్రబాబు అంటున్నప్పటికీ ఆయనకు ముప్పు పొంచి ఉన్నట్లే కనిపిస్తోంది.
చంద్రబాబును కూడా అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నోటుకు ఓటు కేసులో విచారించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు, మంత్రులు జగన్, కెసిఆర్‌లపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే, ఎంతగా వారు కెసిఆర్, జగన్ కుట్ర పన్నారని, కుమ్మక్కయ్యారని విమర్శించినా రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారం నుంచి చంద్రబాబు ఎలా బయటపడుతారనేది ఆసక్తికరంగా మారింది.
నోటుకు ఓటు కేసులో చంద్రబాబు ప్రధాన సూత్రధారి అంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పాటు టిఆర్ఎస్ కూడా విమర్శిస్తోంది. కెసిఆర్ కాళ్లు పట్టుకుని చంద్రబాబు కేసు నుంచి బయటపడాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ హైదరాబాద్ వచ్చి కెసిఆర్‌ను కలవడంపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా పలు ప్రశ్నలు సంధించారు.

రేవంత్ రెడ్డి వ్యవహారంపై చంద్రబాబు ఏమీ మాట్లాడడం లేదు. దీన్ని ఆసరా చేసుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆయనపై దాడి పెంచింది. ఓటుకు నోటు వ్యవహారంలో ఎసిబికి పట్టుబడిన రేవంత్ రెడ్డిపై ఇప్పటికి వరకు చంద్రబాబు ఎందుకు సస్పెండ్ చేయలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి, శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీనివాసులు, మేయర్ సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి శుక్రవారం కడపలో ప్రశ్నించారు.
ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్‌కు డబ్బులు ఎరవేసిన కేసులో చంద్రబాబు ప్రమేయం లేకపోతే రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని వారు మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. మైకు దొరికితే నీతినిజాయితీకి తానే మారు పేరని చంద్రబాబు చెప్పుకుంటారని, కానీ అవినీతికి బట్టలిప్పేస్తే చంద్రబాబు కనిపిస్తారని వారన్నారు.
ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కేవలం ప్రాతదారి మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. అసలు సూత్రదారి చంద్రబాబు నాయుడేనని అన్నారు. రేవంత్ వ్యవహారంలో చంద్రబాబును కూడా ముద్దాయిగా చేర్చి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
డబ్బులు పెట్టి రాజకీయాలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా గతంలో చంద్రబాబు కోట్లు ఖర్చు పెట్టిన విషయాన్ని కర్నె ప్రభాకర్ గుర్తు చేశారు. చంద్రబాబు ఆదేశానుసారం చిన రాజప్ప విజయవాడలో మత్తయ్యను పోలీసుల రక్షణలో ఉంచిన మాట నిజంకాదా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications