మల్కాజ్‌గిరి నుండి బాబు: టిలో ఖాతాకోసం షర్మిల ఢీ?

మరోవైపు విభజన నేపథ్యంలో తెలంగాణ బాధ్యతలను షర్మిలకు ఇచ్చే యోచనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారట. అంతేకాదు, ఆమెను మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేయించే విషయమై చర్చిస్తున్నారట.
మల్కాజిగిరి నుండి పోటీ చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని రంగారెడ్డి టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ఆదివారం చెప్పారు. ఒకవేళ చంద్రబాబు పోటీ చేయకుంటే తాను బరిలోకి దిగుతానని తెలిపారు. అయితే, మల్కాజిగిరి నియోజకవర్గం నుండి చంద్రబాబు తప్పకుండా పోటీ చేయాలని తాము ఆకాంక్షిస్తున్నామని ఆయన చెప్పారు.
బాబును దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల్లో టిడిపి అధికారంలోకి రావాలని అందరూ భావిస్తున్నారన్నారు. కాగా, పార్లమెంటు ఎన్నికలు ముందు వచ్చి, అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమైతేనే చంద్రబాబు లోకసభకు పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఇక, రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ బాధ్యతలను షర్మిలకు అప్పగించనున్నారనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలంటే జనాకర్షణ గల నేత అవసరమని తెలంగాణ ప్రాంత నేతలు అధినేత జగన్‌కు విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిలకు తెలంగాణ బాధ్యతలు అప్పగించి, ఆమెను ఏదో ఒక లోకసభ స్థానం నుండి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే చర్చలు జరుగుతున్నాయట.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆ పార్టీకి పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. సమైక్యాంధ్ర నినాదాన్ని భుజాన మోసుకోవడంతో కొందరు పార్టీ మారగా, మరికొందరు మౌనంగా ఉన్నారు. దీంతో పార్టీని పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో సీమాంధ్ర వారు ఎక్కువ ఉన్నారు. అలాగే మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు నల్లగొండ జిల్లాలో పాక్షికంగా ఈ పార్టీకి బలం ఉంది. అందుకే షర్మిలను సికింద్రాబాద్ లేదా మల్కాజగిరి లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా చర్చ జరుగుతోందని తెలుస్తోంది. మజ్లిస్, సిపిఎం పార్టీతో పెట్టుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తోంది. షర్మిలను తెలంగాణ నుండి పోటీ చేయిస్తే ఆ పార్టీ ఖాతా తెరవడమే కాకుండా, మరిన్ని నియోజకవర్గాల పైన ఆ ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications