అసెంబ్లీలో మార్పు: చంద్రబాబు, జగన్ ఫేస్ టు ఫేస్
హైదరాబాద్: వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకరినొకరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాల్లో డెస్క్ అధికారులు, స్పీకర్ వేదిక అడ్డం రావడంతో వారిద్దరు శాసనసభలో ఒకరినొకరు నేరుగా చూసుకోవడానికి వీలు లేకుండా పోయింది.
శాసనసభలో సీట్లను మార్చేయాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి ఒకరికొకరు కనిపించే విధంగా మార్పులు చేయాలని ఆయన ఆదేశాలిచ్చారు. పాత అసెంబ్లీలో చాలా కాలంగా సమావేశాలు జరగడం లేదని, సీట్ల ఏర్పాటు సరిగా లేదని ఆయన అన్నారు.

దానికి తోడు, సభ్యుడు తన సీట్లోంచి బయటకు వెళ్లాలంటే ఆ వరుసలోని అందరూ లేవాల్సి వస్తోంది. దాంతో మొత్తం సీటింగ్ ఏర్పాట్లను మార్చేయాలని తాను ఆదేశించానని, ఆగస్టు మొదటి వారానికల్లా సిద్ధమవుతుందని స్పీకర్ చెప్పారు.
అసెంబ్లీలోకి ప్రవేశించడానికి స్పీకర్‌కు ప్రత్యేక ద్వారం ఉంది. 1956 నుంచి 1985 వరకు స్పీకర్ ఆ ప్రత్యేక ద్వారం నుంచే లోనికి ప్రవేశించేవారు. అయితే, అసెంబ్లీని మార్చినప్పుడు ఆ ద్వారాన్ని మూసేశారు. పాత లైట్ ఫిక్ష్చర్స్‌ను మార్చేసి కొత్త ఎయిర్ కండీషనర్ వ్యవస్థను పెడుతున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య కార్యాలయాల పంపకం సమస్యను కూడా పరిష్కరిస్తున్నారు. జగన్‌కు పరిపాలనా భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆఫీసు కేటాయిస్తారు. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాత భవనం నుంచి మారడానికి సుముఖత వ్యక్తం చేశారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌కు కేటాయిస్తారు.












Click it and Unblock the Notifications