500 ఎకరాల్లో రాజధాని -జగన్ వ్యాఖ్యలకు సర్కార్ కౌంటర్..!
ఏపీ రాజధాని అమరావతిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం ఇవాళ కౌంటర్ ఇచ్చింది. విజయవాడ-గుంటూరు మధ్య 500 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయలేరా అంటూ జగన్ గతంలో వేసిన ప్రశ్నకు ప్రభుత్వం జవాబు ఇచ్చింది. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ భేటీలో రాజధాని పనులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని మున్సిపల్ మంత్రి నారాయణ ఆ తర్వాత వెల్లడించారు.
ఇవాళ జరిగిన సీఆర్డీఏ భేటీలో తీసుకున్న నిర్ణయాల్లో అమరావతిలో జీఏడీ టవర్,మరో నాలుగు టవర్ల నిర్మాణానికి ఏజెన్సీలకు ఎల్ ఓఏ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. మొత్తం 3673.44 కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్,స్పోర్ట్స్ సిటీ,స్మార్ట్ ఇండస్ట్రీల కోసం కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

ఇప్పటి వరకూ 24 వేల ఎకరాలు పూలింగ్ కు ఇచ్చేందుకు రైతుల ఆసక్తి చూపించారని, గతంలో ఉన్న ల్యాండ్ పూలింగ్ నిబంధనలను కొత్త భూములకు వర్తింపచేసేందుకు అధారిటీ ఆమోదముద్ర వేసిందని ఆయన వెల్లడించారు. అమరావతిలో స్థాపించే విద్య,వైద్య సంస్థలకు రిజిస్ట్రేషన్ ఫీజు లో సడలింపులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. మాజీ సీఎం జగన్ గతంలో రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో ప్రకటించి ఇప్పుడు మాటమార్చారని ఆయన ఆరోపించారు. నిర్మాణాల ధరలు 22 మంది చీఫ్ ఇంజినీర్ల కమిటీ సూచనల మేరకే నిర్ణయించామన్నారు.

నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ మాజీ సీఎం అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. .తమ తప్పేమీ లేకపోయినా గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందని సింగపూర్ అధికారులు చెబుతున్నారన్నారు. అయినా అమరావతి అభివృద్ది కోసం ఇతర సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications