విభజన: 21న ఢిల్లీకి బాబు, రెండు రోజులు అక్కడే
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 21వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. 22వ తేదీన కూడా ఆయన అక్కడే ఉంటారు. రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఢిల్లీలో ప్రభుత్వ పెద్దలను, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
నిజానికి, చంద్రబాబు ఇదివరకే ఢిల్లీ వెళ్లాలని అనుకున్నారు. అయితే, ప్రభుత్వ పెద్దలు, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో ఇప్పటి వరకు ఆగారు. చివరికి ఆయన ఢిల్లీకి 21వ తేదీన వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పెద్దలతో పాటు ఆయన వివిధ జాతీయ పార్టీల నాయకులను కూడా కలుసుకుంటారని సమాచారం.

రాష్ట్రంలోని పరిస్థితిని తాను ఢిల్లీ పెద్దలకు వివరిస్తానని చంద్రబాబు అంటున్నారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. రాజకీయం కోసం తెలుగుజాతి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని ఆయన విమర్శించారు. కాంగ్రెసును ఎదిరించే దమ్ము తమ పార్టీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో తమ పార్టీని కలిపేస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారని ఆయన గుర్తు చేశారు. రాజకీయ పార్టీల నాయకులతో చర్చిస్తే సరిపోదని, విభజన విషయంలో రెండు ప్రాంతాల్లో ఉద్యమిస్తున్నవారితో చర్చించాలని తాను ఢిల్లీ పెద్దలకు సూచిస్తానని చంద్రబాబు అన్నారు.
ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు సీమాంధ్రలో రెండో విడత యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్ర విభజనపై సిడబ్ల్యుసి నిర్ణయం వెలువడిన తర్వాత చంద్రబాబు ఓసారి సీమాంధ్రలోని గుంటూరు, తదితర జిల్లాల్లో పర్యటించారు.












Click it and Unblock the Notifications