బాబు వల్లే 'హీరో'.. ఎమ్మెల్యేగా ఓడిపోయి సైలెంటయ్యా: 'కాపు'పై ముద్రగడ
కిర్లంపూడి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లే కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్లీ తెరపైకి వచ్చి, కాపులలో హీరో అయ్యారా? అంటే అవుననే అంటున్నారు. చంద్రబాబు వల్లే తాము రోడ్డెక్కామని ముద్రగడ పద్మనాభం శుక్రవారం చెప్పారు.
ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. నాడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తమను బీసీలలో ఉంచాలని చెప్పారని, ఆ తర్వాత దామోదరం సంజీవయ్య తమను బీసీలలో చేర్చారన్నారు. తమను పలుమార్లు బీసీ సామాజిక వర్గం నుంచి తొలగించారని అభిప్రాయపడ్డారు.
1993-94లలో కాపులను బీసీలలో చేర్చాలని పెద్ద ఉద్యమం వచ్చిందన్నారు. ఆ రోజు తాను కూడా ఉద్యమంలో పాల్గొన్నానని, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని చెప్పారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో 30ని ఇచ్చారన్నారు.

కాపులకు న్యాయం చేయాలని ఆయన జీవో 30ని తీసుకు వచ్చారన్నారు. అది చెత్త జీవో అని ప్రభుత్వం ఎగతాళి చేస్తోందని, అయితే తమకు బాధ లేదని, మరి మీరు మంచి జీవో ఇవ్వవచ్చు కదా అన్నారు. 1992లో కోట్ల విజయ భాస్కర రెడ్డి జీవో ఇచ్చాక.. ఆ జీవో ఇచ్చిన పార్టీ ఓడిపోయిందని చెప్పారు.
అలాగే ఉద్యమంలో పాల్గొన్న తాను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానని చెప్పారు. దీంతో తాము అప్పుడు మౌనంగా ఉండిపోయామని చెప్పారు. నేను ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను సరే... హామీ ఇచ్చిన చంద్రబాబు కాపులకు ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు.
తాము ఇప్పుడు రోడ్డెక్కడానికి కారణం చంద్రబాబేనని చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో గద్దెనెక్కేందుకు చంద్రబాబు కాపులను బీసీలలో చేర్చుతానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని ఇరవై నెలలు అయినా నెరవేర్చకపోవడంతో రోడ్డెక్కినట్లు చెప్పారు. తాను రోడ్డెక్కలేదని, చంద్రబాబే రోడ్డెక్కించారన్నారు. తాను ఓ మెట్టు దిగినప్పుడు, చంద్రబాబు కూడా ఓ మెట్టు దిగి తమ డిమాండ్లకు ఆమోదం తెలపాలన్నారు.












Click it and Unblock the Notifications