జగన్‌కు కౌంటర్: ఢిల్లీలో చంద్రబాబు నిరాహారదీక్ష?

చంద్రబాబు నాయుడు ఇంకా నిరాహార దీక్షపై నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం సాయంత్రం ఆయన నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశాలున్నాయి. మరోసారి సీమాంధ్ర నేతలతో సమావేశమై ఆయన నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన పూర్తిగా వ్యతిరేకించి, సమైక్యాంధ్ర నినాదాన్ని ఆయన భుజాన వేసుకోవడం లేదు. విభజన జరిగిన తీరును మాత్రమే ఆయన వ్యతిరేకిస్తున్నారు.
విభజనలో సీమాంధ్రకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆయన విమర్సిస్తున్నారు. ఇరు ప్రాంతాలకు చెందిన జెఎసిలతో, ప్రజా సంఘాలతో కేంద్రం చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అరవై రోజులకు పైగా సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శిస్తున్నారు.
కాగా, తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్‌ను ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం నోట్‌ను ఆమోదించడాన్ని హర్షిస్తూ తెలుగుదేశం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు ప్రకటనలు చేశారు. తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నానని, అయితే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని తాను కోరుతున్నానని చంద్రబాబు సమర్థించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications