హోదాపై మాట్లాడను: సుజన, తెలంగాణ ఇస్తేనే: బాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ విషయమై.. కేంద్రం నుండి ఆ ప్రకటన వచ్చే వరకు తాను ఏమీ మాట్లాడనని కేంద్రమంత్రి సుజనా చౌదరి సోమవారం అన్నారు. తమ డిమాండ్ మాత్రం ప్రత్యేక హోదానే అన్నారు. ఏపీ భవన్‌లో మంగళవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడారు.
విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేలా కనిపించట్లేదని చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా స్థాయి ప్యాకేజీని సాధించుకునేందుకు సిద్ధం కావాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు సూచించారు.
ఒకపక్క ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇవ్వకపోవచ్చుననే సంకేతాలే ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు ఈ భేటీలో అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు గ్రాంటుల రూపంలో వస్తాయని, ప్రత్యేక ప్యాకేజీ కింద కూడా అదే స్థాయిలో లేదంటే 70 శాతానికి తగ్గకుండా నిధులు సాధించేందుకు సిద్ధం కావాలన్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు, పనులకు కేంద్రం నుంచి నిధులు సాధించాలని సూచించారు. ఈ మేరకు ఇప్పటి నుంచే ఆయా శాఖల కేంద్ర మంత్రుల్ని కలవాలని తెలిపారు. ఒకటికి రెండుసార్లు కేంద్ర మంత్రుల్ని కలవటంలో తప్పులేదని, వాస్తవానికి అలా కలిసి వివరించబట్టే గత నెలలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల అయ్యాయని గుర్తు చేశారు.
కాగా, పార్లమెంటులోనూ బయటా ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలబడాలని ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. భూసేకరణ బిల్లు విషయంలో కూడా అన్ని విధాలా సహకరించాలని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, జరపాల్సిన చర్చలు మొదలైన అంశాలపైనా పలు సూచనలు చేశారు.
శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం ఎన్‌కౌంటర్ గురించి తమిళనాడు ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావిస్తే తక్షణం స్పందించి వాస్తవాలను తెలియజేయాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ నీటిని రాయలసీమ అవసరాలకు వాడుకునేందుకు తెలంగాణ అంగీకరిస్తే ఆ రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు సహా పార్టీ ఎంపీలంతా ఈ భేటీకి హాజరయ్యారు. బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా ఇందులో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications