బాబుకు ప్రధాని మోడీ పిలుపు: హోదా, ప్యాకేజీ.. రెండు కావాలి
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కావాలని ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరనున్నారు. వెనుకబడిన జిల్లాలకు రూ.24వేల కోట్లకు పైగా ప్యాకేజీ అడగనున్నారు. ఈ నెల 17వ తేదీన చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.
విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించినట్టుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, 7 వెనుకబడిన జిల్లాలకు రూ.24,350 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. రెవిన్యూ లోటు భర్తీ, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధుల అంశాన్ని కూడా ప్రధానికి నివేదించనున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న కరవు పరిస్థితులను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రులతో విడివిడిగా సమావేశమవుతున్న ప్రధాని మోడీ ఈ నెల 17న చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ భేటీకి రాష్ట్రం నుంచి నలుగురు రావాలని పీఎంవో నుంచి పిలుపు వచ్చింది.

అయితే ఈ సంఖ్యను మరింత పెంచాలని, అవసరమైన మంత్రులనూ అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరింది. ఆ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం అడగాలన్నదానిపై వివరాలు తెలుసుకోవడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ గురువారం అధికారులతో భేటీ అయ్యారు.
గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి మిగతా రాష్ట్రాలతోపాటు వచ్చిన సాయం ఎంత? విభజన చట్టానికి లోబడి ఏపీకి ప్రత్యేకసాయం ఎంత? అన్నదానిపై కూడా నివేదికలు సమర్పించాలని సీఎంవో నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన నివేదికలు తయారుచేసే బాధ్యతను ఆర్థిక శాఖకు అప్పగించింది.












Click it and Unblock the Notifications