'ఇక ఢిల్లీకి అనవసరం': హోదాపై బాబు అలా, ప్రధాని ఆఫీస్ ఇలా..
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక ఢిల్లీకి వెళ్లడం మానుకోవాలని, ఆయన ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడిగే ధైర్యం లేదని తెలిసిపోయిందని వైసిపి ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ప్రజల, ప్రతిపక్షాల పోరు భరించలేకనే డిల్లీ వెళ్ళారు తప్ప ఏదో సాధించుకొని వద్దామని కాదని ఆరోపించారు. ఆయనకు ప్రధాని మోడీని గట్టిగా నిలదీసి అడిగే ధైర్యం లేదన్నారు. నిన్నటి డిల్లీ పర్యటనతో ప్రత్యేక హోదాపై మోడీని గట్టిగా నిలదీయలేరని మళ్ళీ మరోమారు నిరూపించుకున్నారన్నారు. కాబట్టి ఆయన ఇంకా ఎన్నిసార్లు డిల్లీ వెళ్లి వచ్చినా ప్రయోజనం లేదన్నారు.
హోదాపై చంద్రబాబు అలా, పీఎంవో ఇలా..

మంగళవారం నాడు ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. ప్రత్యేక హోదా పైన ఆందోళన అవసరం లేదని మోడీ చెప్పారని మీడియా సమావేశంలో చెప్పారు. విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పారన్నారు.
అయితే చంద్రబాబు వాటిని పొడిపొడిగానే చెప్పారని, హామీ లభించినట్లు చెప్పినట్లుగా కనిపించలేదంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, అభివృద్ధి ప్యాకేజీ, ప్రోత్సాహకాల పైన తాను ప్రధాని మోడీకి వివరించానని చెప్పారు. భేటీ పైన సంతృప్తి వ్యక్తం చేశారు. 12 అంశాలతో నివేదిక ఇచ్చినట్లు చెప్పారు.
అదే సమయంలో పీఎంవో నుంచి మాత్రం వాటన్నింటి పైన ఎలాంటి స్పందన రాలేదు. కరువు అంశాల పైన ప్రధాని మోడీ, చంద్రబాబు మధ్య చర్చ జరిగినట్లుగా పీఎంవో విడుదల చేసిన ప్రకటనలో ఉంది. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన బాబు కరువు, పోలవరం నిధులు, రాజధాని నిర్మాణ నిధులు, రెవెన్యూ లోటును అడిగినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించినట్లుగా పేర్కొనలేదు.












Click it and Unblock the Notifications