సోనియా కుట్ర, జగన్ సూచనే: ధర్నాలో బాబు తెలంగాణ
విజయవాడ: బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పును నిరసిస్తూ విజయవాడలోని కృష్ణా బ్యారేజీ వద్ద మహాధర్నా చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విభజన అంశాన్ని ప్రస్తావించారు. తెలుగు జాతి విధ్వంసానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు.
విభజన పేరుతో తెలుగు ప్రజల మధ్య కాంగ్రెసు పార్టీ చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ విభజనలో కేంద్రం సంప్రదాయాలు పాటించడం లేదన్నారు. విభజనపై అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందేనని చెప్పారు. ఢిల్లీ పెద్దలు ఈ అంశంపై రోజుకో మాట మాట్లాడుతూ తెలుగు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు.

ఆర్టికల్ 3 ప్రకారం విభజించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచించారని, ఇప్పుడు సమైక్యం ముసుగు వేసుకున్నారన్నారు. జగన్ సమైక్య ముసుగులో విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. విభజనపై ఇరువైపుల ఆమోదయోగ్య పరిష్కారం వచ్చే వరకు ఇరు ప్రాంతాల ఐకాస నేతలు తదితరులతో మాట్లాడాలని తాము సూచించామన్నారు.
గతంలో 356 అధికరణ కింద ప్రభుత్వాన్ని రద్దు చేస్తే తెలుగు జాతి పౌరుషం కాంగ్రెసు పార్టీకి రుచి చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్నారు. ఇప్పుడు సోనియా మళ్లీ రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. సోనియా ఆదేశాల మేరకే మంత్రుల బృందం (జివోఎం) పని చేస్తోందన్నారు.
తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్న తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసు పార్టీలకు ప్రజలు గట్టి బుద్ధి చెబుతారన్నారు. తెలుగుదేశం పార్టీ కక్కుర్తి, ముడుపుల కోసం పుట్టిన పార్టీ కాదన్నారు. సోనియా ఆదేశాలతోనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తనకు ఆపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. తెలుగు జాతిని టిడిపి కాపాడుతుందన్నారు.












Click it and Unblock the Notifications