ఏ త్యాగానికైనా సిద్ధం, మౌనంగా ఉండలేను: పవన్ జేఎఫ్‌సీపై బాబు పరోక్ష వ్యాఖ్యలు
గుంటూరు: తమకు రాష్ట్ర ప్రయోజనాల కంటే ఏదీ ఎక్కువ కాదని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా నష్టపోయిందని, తెలుగు జాతికి అన్యాయం జరిగితే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేయాలనే బీజేపీతో ఆ రోజు పొత్తుపెట్టుకున్నట్టు తెలిపారు.
శనివారం ఆయన గుంటూరు జిల్లా కాకాని వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జేఎన్టీయూ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జేఎన్టీయూ భవనాల నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

హామీలు నెరవేర్చాల్సిందే..
విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామాలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకు న్యాయం చేయాలని కోరారు. ఆ రోజు ఇచ్చిన హామీలన్నంటినీ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టు పునరుద్ఘాటించారు.

అప్పటి వరకూ పోరాటం
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందరి సహకారంతో రాష్ట్ర హక్కులను సాధించుకోవాలన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని సీఎం అన్నారు.

మౌనంగా ఉండలేకపోతున్నా.. బాబు ఆవేదన
పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని.. విభజన జరిగి నాలుగేళ్లైనా నేటికీ హామీలు అమలుకు నోచుకోవడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాను మౌనంగా ఉండలేకపోతున్నానని చెప్పారు. చేయని తప్పునకు మనమెందుకు శిక్ష అనుభవించాలని అన్నారు.

చర్చకు సిద్ధం
రాష్ట్రానికి చాలా విధాలుగా సాయమందించామని చెబుతున్నారని.. వాటిపైనా చర్చిద్దామని చంద్రబాబు అన్నారు. ఏ రాష్ట్రానికి ఏమిచ్చారు? ఏపీకి ఎంతిచ్చారు? అనేది తేలాల్సిందేనని అన్నారు. ప్రధాని, కేంద్రమంత్రులు ఏపీకి సాయమందించాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్ అప్పుడు అన్యాయం చేసిందని, ఇప్పుడు కేంద్రం సరైన న్యాయం చేయలేదని అన్నారు. 5కోట్ల ఏపీ ప్రజల తరపున తమకు న్యాయం చేయాలని అడుగుతున్నానని చంద్రబాబు అన్నారు.

అందుకు బీజేపీతో ఉన్నాం.. కానీ
రాష్ట్రాన్ని హేతుబద్దంగా విభజిస్తే సమస్య వచ్చేది కాదని, వన్ సైడ్‌గా విభజించారని అన్నారు. ఏపీకి న్యాయం జరుగుతుందనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే మన వాళ్లు మంత్రులుగా కేంద్రంలో, వాళ్లు మంత్రులుగా మన రాష్ట్రంలో ఉన్నారని చెప్పారు. కేంద్రం చివరి బడ్జెట్ లోనూ అన్యాయం చేయడంతో మౌనంగా ఉండలేకపోతున్నామని అన్నారు.
ఇప్పటికే ఏపీకి అన్యాయం జరిగిందని చాలా సార్లు కేంద్రానికి చెప్పామని తెలిపారు.
పార్లమెంటులో ప్రధాని కూడా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని ఒప్పుకున్నారని చెప్పారు.

పవన్‌పై పరోక్షంగా
కాగా, ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని చంద్రబాబునాయుడు పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జేఎఫ్‌సీకి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్కలు అడగడం సరికాదన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి గలవని, కేంద్రం పార్లమెంటులో, రాష్ట్రం అసెంబ్లీలో లెక్కలు చెబుతాయని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని చెప్పారు.












Click it and Unblock the Notifications