కొద్ది రోజుల్లోనే ఎంత చేశావ్!: బాబుతో సింగపూర్ ప్రధాని, విశాఖపై కొరియా ఆసక్తి
సింగపూర్/విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ మంగళవారం నాడు ప్రశంసించారు. విభజన అనంతరం... తక్కువ కాలంలోనే పెట్టుబడుల అనుకూల రాష్ట్రంగా ఏపీని మార్చారని చంద్రబాబును లీ సీన్ లూంగ్ ప్రశంసించారు.

సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌తో మంగళవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక అందించినందుకు ఈ సందర్భంగా లీ సీన్ లూంగ్‌కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరుకావాలని ఆహ్వానించారు.

ప్రపంచంలో పెట్టుబడులకు అనుకూల రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని లీ సీన్ లూంగ్ ఏపీ సీఎం చంద్రబాబును ప్రశంసించారు. సింగపూర్ పర్యటనలో చివరి రోజు ప్రధాని లీ సీన్ లూంగ్‌తో చంద్రబాబు బృందం భేటీ అయ్యారు.
అమరావతి చారిత్రక ప్రాశస్థ్యాన్ని సింగపూర్ ప్రధానికి వివరించారు. ఆచార్య నాగార్జునుడు అమరావతి నుంచే బుద్దిజంను విశ్వవ్యాపితం చేశారని ఈ సందర్భంగా ప్రధానికి చంద్రబాబు వివరించారు. అంతర్జాతీయ స్థాయి ఇన్‌ఫ్రాస్టక్చర్ ఏర్పాటుకు, నాలెడ్జ్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి సహకరించాలని కోరారు.

సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్ హబ్‌గా చేయాలనేది తన సంకల్పమని, అందుకు తగిన సహకారాన్ని అందించాలని సింగపూర్ ప్రధానిని కోరారు. ఏపీ సమగ్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. తక్కువ కాలంలోనే అద్బుత పనితీరు చూపారని చంద్రబాబును సింగపూర్ ప్రధాని ప్రశంసిస్తూ... రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాల భూసమీకరణ పట్ల అభినందనలు తెలిపారు.

విశాఖలో పెట్టుబడికి కొరియా ఆసక్తి
ఏపీలోని విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ఆసక్తి కననబరుస్తోంది. 'కొరియా కార్వాన్ 2015 ఇన్ ఆంధ్రప్రదేశ్' విశాఖలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, గంటా శ్రీనివాస్ రావు, కొరియా అంబాసిడర్ జూలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొరియాకు చెందిన జూలీ మాట్లాడారు. మెగా ఎలక్ట్రానిక్ కంపెనీకి విశాఖ అనుకూలం అన్నారు. కొరియా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోందన్నారు.












Click it and Unblock the Notifications