మీరా.. నేనా ఈ గడ్డపై సవాల్, జగన్ ఆస్తుల జఫ్తు ఏది: మోడీకి బాబు, పవన్‌పై ఫైర్
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ధర్మ పోరాట సభలో ప్రధాని నరేంద్ర మోడీ, వైసీపీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. అవిశ్వాస తీర్మానం సమయంలో తనలో పరిపక్వత లేదని మోడీ అన్నారని, పరిపక్వత లేనిది మీకా.. నాకా తేల్చుకుందాం రండి అని సవాల్ విసిరారు.
ప్రత్యేక హోదా విషయంలో ఎవరూ అధైర్యపడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. కేంద్రం మెడలు వంచైనా సాధిస్తామన్నారు. బీజేపీతో జగన్, పవన్ లాలూచీ పడ్డారని ఆరోపించారు. రాష్ట్రానికి వారిద్దరు ద్రోహం చేస్తున్నారన్నారు. విభజన సమయంలో ఏపీకి దెబ్బతగిలిందని, ఆ దెబ్బ తగిలిన చోటే కారం పూస్తారా అని నిప్పులు చెరిగారు. కేంద్రంది శాడిస్ట్ మనస్తత్వం అన్నారు.

తెలుగు పౌరుషం రుచి చూపిస్తాం, బ్రిటీష్ వారికి సహకరించినట్లు
వైసీపీ ఉచ్చులో పడింది తాను కాదని, మీరేనని మోడీని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ఎన్డీయేకు తెలుగు పౌరుషాన్ని రుచి చూపిస్తామని హెచ్చరించారు. మాకు రావాల్సింది వడ్డీతో సహా వసూలు చేస్తామని చెప్పారు. స్వాతంత్రంయ కోసం అప్పట్లో మన నాయకులు పోరాడుతుంటే కొందరు బ్రిటిషు వారితో కలిసినట్లు ప్రస్తుతం కొన్ని పార్టీలు బీజేపీతో కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు వెన్నుపోటు పొడుస్తున్నాయని జనసేన, వైసీపీలను ఉద్దేశించి చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ఇది ఏపీకి జీవన్మరణ సమస్య అన్నారు. నేను మోడీ కంటే ముందే సీఎంను అయ్యానని, పట్టుదలతో పనిచేసే తనకు పరిణతి లేదంటారా అన్నారు.

మోడీకి ఇక్కడి నుంచి సవాల్
ఈ ఒంగోలు నుంచి సవాలు విసురుతున్నానని, పరిణతి లేనిది ఎవరికి? మీకా... నాకా? ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం కోసం ఎవరినైనా ఎదిరిస్తానని ఆనాడే చెప్పానని, అందుకే ఈరోజు పోరాడుతున్నానని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో మోడీ అసత్యాలు చెప్పారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం అడ్డుపడిందని చెప్పారని, కానీ, ఆ సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి మాకు సంబంధం లేదని చెప్పారని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో ఒక్కో విగ్రహానికి రూ.2500 కోట్లు ఇస్తున్నారని, నష్టాలపాలైన గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్‌ను ఓఎన్‌జీసీలో కలుపుతున్నారని, అహ్మదాబాద్- ముంబై మెట్రో రైలు మార్గానికి నిధులిచ్చారని, వాటన్నిటికీ ఇచ్చి ఏపీకి ఎందుకు ఇవ్వరని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించడం లేదన్నారు. విశాఖ రైల్వేజోన్ మన హక్కు అన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం మీరు కట్టకపోయినా తాను కడతానని చెప్పారు. పదేళ్ల పాటు మీకు పన్ను చెల్లించం ఒప్పుకోండి అన్నారు.

జగన్ ఆస్తుల జఫ్తుపై చంద్రబాబు ప్రశ్న
తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అవినీతిపరుల ఆస్తుల్ని జప్తు చేస్తామని మోడీ నాడు చెప్పారని, నాలుగేళ్లయినా జగన్ ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇందులో లాలూచీ లేదా అన్నారు. వైసీపీ నేతలు పిరికితనంతో రాజీనామాలు చేశారన్నారు. ఎన్నికలు రావని తెలుసన్నారు. విభజన సమయంలో, ఇప్పుడు పోరాింది, పోరాడుతోంది కేవలం టీడీపీయే అన్నారు. ఆ రోజు వైసీపీ నాయకులు లేరని, ఎక్కడో దాక్కున్నారన్నారు. ఇప్పుడేమో రాజీనామా చేసి ఇళ్లలో, రోడ్లపై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మొదట వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారని, అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడాక, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తానంటే బీజేపీలో చేరి టిడిపిని విమర్శిస్తున్నారన్నారు. బీజేపీ వాళ్లు ఇక్కడ జగన్, పవన్‌లను చూసుకుంటున్నారని, వాళ్లు మన పోరాటానికి, మన అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు.

పవన్ కళ్యాణ్ చెప్పి చేయిచ్చారు
మీరు అవిశ్వాసం పెడితే నేను ఢిల్లీకి వస్తానని, మద్దతు కూడగడతానని పవన్ కళ్యాణ్ చెప్పారని, కానీ ఆ తర్వాత ఏమయిందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పుడు మనకు అడ్డుపడుతున్నాడన్నారు. మీరు అవిశ్వాసం పెట్టండి అంటూ జగన్ చెప్పారని, పెట్టినప్పుడు ఆ పార్టీ నాయకులు ఎక్కడకు వెళ్లారని నిలదీశారు. దేశంలోని అన్ని పార్టీలు మద్దతిచ్చాయని, మీరు రాజీనామాలు చేసి బయటకు వచ్చారని, తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు. కేంద్రం శాడిస్ట్ మనస్తత్వంతో వ్యవహరిస్తోందన్నారు. హైదరాబాద్ నగరాన్ని నిర్మించి తెలంగాణకు ఇచ్చి వచ్చానని, ఇప్పుడు దానిని మించిన రాజధానిని నిర్మిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిని మనమే నిర్ణయిద్దామని, అందుకు 25 స్థానాలలో ఎంపీలను గెలిపించాలన్నారు.












Click it and Unblock the Notifications