బాబు లాబీయింగ్-గడ్కరీ వరాలు: మోడీతో కేటీఆర్ సై, కేసీఆర్ ఆరోగ్యంపై..
హైదరాబాద్: ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఎన్డీయేలో భాగస్వామి అయిన చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా.. తదితర అంశాల పైన కేంద్రమంత్రులతో చర్చిస్తున్నారు. ఆ దిశగా త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నారు.
చంద్రబాబు గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రి ఉమాభారతిని కలిశారు. శుక్రవారం నాడు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీ తదితరులను కలిశారు.
ఆర్టీసీ విభజనపై నితిన్ గడ్కరీ
ఆర్టీసీ విభజన వివాదాస్పద అంశం కాదని రెండు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తున్నానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఆర్టీసీ విభజనలో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తామన్ారు. ఏపీ రాజధానిని కలిపే మార్గాలను జాతీయ రహదారులుగా మారుస్తామన్నారు.
గుంటూరు - విజయవాడ, రాయలసీమ నుండి రాజధాని వరకు గల మార్గాలను జాతీయ రహదారులుగా మారుస్తామని చెప్పారు. జాతీయ రహదారుల కోసం చేపట్టే భూసేకఱణ పైన చంద్రబాబు భరోసా ఇచ్చారన్నారు. భూసేకరణ వల్ల వచ్చే సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు చెప్పారని తెలిపారు. దుగరాజుపట్నం పోర్టు నిర్మాణానికి సాయం కోరారన్నారు.

మరోవైపు, తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం హైదరాబాదులో మాట్లాడుతూ.. తాము కేంద్ర ప్రభుత్వంతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విదేశాల్లో పర్యటించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు.
కేసీఆర్ పర్యటన వివరాలు ఖరారు అయ్యాక చెబుతామన్నారు. కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తు కోసం అమెరికాతో పాటు చాలా దేశాలు వెళ్తారన్నారు. కేసీఆర్ విదేశాల్లో పర్యటించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. ఐటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రణాళిక ఉందని చెప్పారు.
ఐటీ వరల్డ్ కాంగ్రెస్ సదస్సును హైదరాబాదులో నిర్వహిస్తున్నందుకు నాస్కాంకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృతజ్ఠతలు తెలిపారు. ఐటీ వరల్డ్ కాంగ్రెస్‌కు ప్రపంచ ఐటీ దిగ్గజాలను ఆహ్వానిస్తామన్నారు. భారత, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. 2016లో బ్రెజిల్లో జరిగే సదస్సుకు రాష్ట్ర బృందం వెళ్తుందని చెప్పారు.
కాగా, కేసీఆర్ ఆరోగ్యం పైన అనుమానాలు వద్దని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం చాలా బాగుందన్నారు. తామందరి కంటే కూడా కేసీఆరే వందశాతం ఫిట్‌గా ఉన్నారన్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని, ఈ మధ్య పుకార్లు వినిపించాయి. దీంతో కేటీఆర్ వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications