అసెంబ్లీలో బాబు 'విభజన', కెసిఆర్‌కు విజ్ఞప్తి, కేసులని..
హైదరాబాద్: గవర్నర్ తీర్మానం పైన జరిగిన చర్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై సభలో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ ఎన్నికలకు ముందు విభజన చేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో విభజన చేస్తే రాజకీయ లబ్ధి జరుగుతుందని వారు అలా చేశారన్నారు.
విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ నాటకాలు ఆడితే.. అందులో చాలామంది తమ పాత్ర పోషించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. విభజన జరిగిన తీరును తాను తప్పు పట్టానని చెప్పారు. 2008 వరకు తెలుగుదేశం పార్టీ సమైక్యంగా ఉండాలనుకుందని చెప్పారు. 2004లో సమైక్యమనే మేనిఫెస్టోలో పెట్టామని, ఎన్నికలకు వెళ్లి ఓడిపోయామన్నారు. ఆ తర్వాత తాము సమన్యాయం కోరుతూ విభజనకు మద్దతు పలికామన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన దానిని తాము పూర్తి చేస్తున్నామని నాడు చాలామంది చెప్పారన్నారు. విభజనకు నాంది వైయస్ అని అభిప్రాయపడ్డారు. విభజన కుట్రకు పాల్పడిన కాంగ్రెసు పార్టీ చిరునామాను ప్రజలు గల్లంతు చేశారన్నారు. ఎపిలో ఒక్కసీటు కూడా రాకుండా ఓడించారన్నారు. ఇరువైపుల న్యాయం చేసి విభజన చేయాలని తాను సూచించానన్నారు. విభజనకు హేతుబద్దత ఉండాలని తాను సూచించానన్నారు.
తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లవంటివన్నారు. అందుకే సమన్యాయం అడిగానన్నారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం టిడిపి పుట్టిందన్నారు. ప్రపంచంలో తెలుగు వారికి ఎక్కడ అన్యాయం జరిగినా టిడిపి స్పందిస్తుందన్నారు. టిడిపి ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసిందని, రెండు ప్రాంతాలలో తమవారు అధికారంలోకి వస్తారని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావించారని కానీ, అది ఎదురు తిరిగిందన్నారు.
హైదరాబాదు లాంటి నగరాన్ని ఎపిలో కట్టాలంటే నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు అవసరమని తాను చెప్పానన్నారు. తెలంగాణకు మిగులు బడ్జెట్ తమ పాలన వల్లే వచ్చిందన్నారు. పోలవరం జాతీయ పార్టీ అని చెప్పారే కానీ స్పష్టమైన చట్టం తీసుకు రాలేదన్నారు. పోలవరం ముంపు గ్రామాల విషయంలో రగడ తీసుకు వచ్చారన్నారు. తెరాస దానిని రాజకీయం చేస్తోందని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి, తెలుగు జాతి ఉండాలి
ఎపి సభ సాక్షిగా తాను తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని పోలవరంపై రాజకీయం చేయవద్దన్నారు. తెలంగాణతో సమానంగా ఎపి అభివృద్ధి కోసం పెట్టుబడులు, కళాశాలలు, పరిశ్రమలు కావాలన్నారు. వీటి కోసం తాము కేంద్రాన్ని కోరానని చెప్పారు. తెలంగాణతో, పక్క రాష్ట్రాలతో సమానంగా వచ్చే వరకు ఎపికి నిధులు కావాలని తాను మోడీని అడిగానని చెప్పారు. తెలంగాణకు ఇచ్చిన దానిని వెనక్కి తీసుకోవాలని తాను ఎక్కడా కోరలేదన్నారు.
ఈ రోజు తెలుగు జాతి కలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది స్వార్థశక్తుల వల్ల తెలుగు జాతి విడిపోయిందన్నారు. విడిపోయింది సరే... ఇప్పటికైనా సహకరించుకోవాలా లేక విద్వేషాలు రెచ్చగొట్టుకోవాలా అని ప్రశ్నించారు. ఇప్పుడు కక్షసాధింపులు వద్దన్నారు. తెలంగాణలోని ప్రజలు ఎపికి అన్యాయం జరగాలని కోరుకోలేదని, అలాగే ఎపి ప్రజలు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగాలని కోరుకోలేదన్నారు. కొన్ని రాజకీయ శక్తులు తమ స్వార్థం కోసం విభేదాలు రెచ్చగొట్టాయని అభిప్రాయపడ్డారు.తెలుగు జాతి కలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భాష ఒకటే, సంప్రదాయం ఒకటే, బంధాలు
ఒకటే అన్నారు. అనవసరంగా విద్వేషాలు రేపి ప్రజల్ని విడదీయాల్సిన అవసరం లేదన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగువారికి గౌరవం కావాలని, న్యాయం జరగాలని మద్రాసు రాష్ట్రం నుంచి ప్రాణాలు ఫణంగా పెట్టి కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా చేశారని, తెలుగుజాతి ఏకమవ్వాలనే ఉద్దేశంతో హైదరాబాదును కలుపుకున్నామన్నారు.
ఇప్పుడు కొంతమంది రాజకీయ స్వార్ధం కోసం మరోసారి విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. సచివాలయంలో 80 వేల ఉద్యోగాలు ఉండాలి కానీ, 50 వేల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. వార్ రూం పెట్టి విభేదాలు రేపాలని, ఇప్పుడు కూడా విద్యుత్ విషయంలో వివాదాలు రేపి విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలామంది చూస్తున్నారన్నారు. దానిని పరిష్కరించేందుకు ఢిల్లీ వెళ్తున్నానని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో కేంద్రంలోని వివిధ విభాగాలతో సంప్రదించి సమస్య పరిష్కరిస్తానన్నారు.
బిజెపితో పొత్తుపై వివరణ
కొందరు తమను బిజెపితో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రశ్నించారని.. కానీ తెలుగు ప్రజల కోసమే తాము పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. దూరదృష్టితో తాము కలిశామన్నారు. తాము ఆశించినట్లుగానే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిందన్నారు.
రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి అధికారంలోకి వచ్చి ఆర్థికంగా బలపడేలా చేశామని చంద్రబాబు అన్నారు. గతంలో అధికారం చేపట్టి రాష్ట్రాన్ని అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేశానన్నారు. తాను అధికారం చేపట్టి కేవలం నెల రోజులే అయిందన్నారు. గతంలో అధికారం చేపట్టినప్పుడు రెండుకోట్ల ఉద్యో గాలు రాష్ట్రానికి వస్తాయని చెప్పామని, అన్నట్టుగానే సాఫ్ట్‌వేర్, ఫార్మా, హార్డ్‌వేర్ రంగాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. ఇప్పుడు కూడా కష్టకాలంలో రాష్ట్రంలో అధికారం చేపట్టామన్నారు.












Click it and Unblock the Notifications