కేంద్రమే.. చేతులెత్తేసిన బాబు! కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోశారు, రాజధానిపై చురక
హైదరాబాద్: కేంద్రం సాయం చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలదొక్కుకోలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం శాసన సభలో నిస్సహాయత వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తున్నామన్నారు. అయితే కేంద్రం సాయం అవసరమన్నారు.
ఈ ఏడాదికి రూ. 15,350 కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నామన్నారు. నిస్సహాయత వ్యక్తం చేశారు. ఏపీలో కష్టాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని దుమ్మెత్తి పోశారు. రెవెన్యూ లోటు ఉందన్న ప్రభుత్వ వాదనతో ఆర్థిక సంఘం ఏకీభవించిందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాన్ని ఆదుకుంటుందన్న నమ్మకముందన్నారు.
ప్రతిదానికి కేంద్రం పైనే ఆదారపడకుండా రాష్ర్టానికి ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి నీటి సమస్య ఉండదన్నారు. ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్నారు.

విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామన్నారు. 2029 నాటికి దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే మంచి గమ్యస్థానంగా నిలుపుతామన్నారు.
హుధుద్ తుఫాను వల్ల రూ.69వేల కోట్ల నష్టం వాటిల్లిందని, విపత్తు సమయంలో ప్రభుత్వ చర్యలను ఐక్య రాజ్య సమితి ప్రశంసించిందని చెప్పారు. పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. భవిష్యత్తులో విద్యుత్ సమస్య లేకుండా చేసే సత్తా ఉందన్నారు.
అడవులలో రాజధాని కట్టుకోవడం మంచిది కాదని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఆదాయం పెరిగిందంటే అది హైదరాబాదు వల్లే అన్నారు. కేంద్ర స్థానంలో ఉన్నందునే రాజధాని నిర్మాణానికి గుంటూరు ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. రాజధాని వస్తే భూముల విలువ పెరుగుతుందన్నారు.
40 వేల ఎకరాల్లో మాస్టడర్ ప్లాన్ ఇస్తామని సింగపూర్ చెప్పిందని, మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని జపాన్ కూడా ముందుకొచ్చిందన్నారు. ప్రాధాన్యతగల గమ్యస్థానంగా ఏపీని జపాన్ ఎంచుకుందని చెప్పారు. కోర్ క్యాపిటల్ వద్ద 225 కిలోమీటర్ల రింగ్ రోడ్డు వస్తుందని, ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని అవుతుందన్నారు.
భూసేకరణకు సహకరించిన రైతులను జీవితంలో మరిచిపోలేమన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత తనదేనని చెప్పారు. తాను తెచ్చిన సంస్కరణలను గత ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. పేదలకు టీడీపీ అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
ఫించన్ల మొత్తాన్ని 5 రెట్లు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, పెన్షన్ల కోసం రానున్న ఐదేళ్లలో రూ. 30 వేల కోట్ల ఖర్చు చేస్తామన్నారు. తెలుగు ప్రజలు క్రాస్‌రోడ్స్‌లో ఉన్నారని, రాష్ర్టాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని, ప్రజలు మమ్మల్ని నమ్మి అప్పగించిన బాధ్యతల నుంచి తప్పించుకోమన్నారు.
పేదరికం, ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. సంక్షేమం, అభివృద్ధికి తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. ఏపీ అభివృద్ధికి ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు రూపొందించుకున్నామన్నారు. ఈ ఏడాది 38 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, దీంతో రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత కరువు సంభవించిందన్నారు.












Click it and Unblock the Notifications