ఏపీ నూతన రాజధానికి ప్రధాని మోడీచే శంకుస్ధాపన..!
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ చేత నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్ధాపన చేయించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీర్మానించినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 9న ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని శంకుస్ధాపనకు రావాల్సిందిగా ప్రధాని మోడీని ఆహ్వానించనున్నారు. రాజధానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన చంద్రబాబు, ప్రధాని మోడీని కలిసిన తర్వాత అధికారికంగా తేదీని నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.

సింగపూర్ ప్రతినిధి బృందం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కు తుది మెరుగులు దిద్దిన చంద్రబాబు, సరైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఖరారైన తర్వాతే రాజధాని నిర్మాణానికి శంకుస్ధాపన తేదీని ప్రకటించాలన్న నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఏపీ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన చట్టంలోని 94(3) ప్రకారం నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మొత్తాన్ని బడ్జెటరీ కేటాయింపు రూపంలో అందించనుంది.
కొత్త రాజధాని నిర్మాణంతోపాటు రాజభవన్, రాష్ట్ర సచివాలయం, శాసన సభ, హైకోర్టు నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం కింద నిధులు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలో పేర్కొంది. రూ.1500 కోట్లలో.. వెయ్యి కోట్ల రూపాయలు కొత్త రాజధానిలో అత్యవసర, మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు కేటాయించారు. రూ.500 కోట్లతో రాజ్ భవన్, సచివాలయం, శాసన సభ, హైకోర్టు తదితర భవనాలు నిర్మించనున్నారు.












Click it and Unblock the Notifications