విదేశాలకు సీఎం చంద్రబాబు-ప్రధాని మోడీ టూర్ వాయిదా..!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యం బిజీ బిజీగా గడుపుతున్న చంద్రబాబు.. దీన్నుంచి రిలీఫ్ కోసం కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. అదే సమయంలో ప్రధాని మోడీ అమరావతి రాజధాని పర్యటన కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని మోడీ వచ్చే లోపు చంద్రబాబు విదేశీ పర్యటన పూర్తి చేసుకుని రానున్నట్లు సమాచారం.
సీఎం చంద్రబాబు ఈ నెల 17 అంటే ఎల్లుండి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లబోతున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఐదు రోజుల పాటు చంద్రబాబు విదేశీ పర్యటన ఉండబోతోంది. ఈ నెల 20న చంద్రబాబు తన పుట్టిన రోజును కుటుంబంతో కలిసి విదేశాల్లో జరుపుకునేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. పుట్టినరోజు పూర్తయ్యాక చంద్రబాబు తిరిగి అమరావతి చేరుకుంటారు.

అలాగే అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన ఈ నెలలో జరగాల్సి ఉంది. మూడో వారంలో ఇక్కడికి వచ్చి అమరావతి రాజధాని పనులకు మోడీ శంఖుస్థాపన చేస్తారని ప్రభుత్వ వర్గాలు గతంలో చెప్పాయి. కానీ ఈ టూర్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నెలకు బదులుగా మే నెల 2న ప్రధాని మోడీ అమరావతి రాజధానికి వస్తారని సమాచారం. అమరావతి పునర్ నిర్మాణ పనుల్ని ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు. ఈ నెలలో బిజీ షెడ్యూల్స్ ఉన్నందున ప్రధాని టూర్ వాయిదా పడినట్లు సమాచారం.
వాస్తవానికి ప్రధాని మోడీ 2016లోనే ఓసారి అమరావతి రాజధాని పనులకు శంఖుస్ధాపన చేశారు. అప్పట్లో వివిధ నదుల నుంచి నీళ్లు, మట్టి కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబుకూ, మోడీకి చెడిపోవడంతో ఇది కూడా విమర్శల్లో భాగమైంది. అయితే మరోసారి మోడీని అమరావతి పనుల పునఃప్రారంభం కోసం చంద్రబాబు తెస్తుండటంతో ఈసారి ఆయన ఏం తీసుకురాబోతున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు అమరావతిలో కొత్త అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణానికి ఇవాళ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications