వెలగపూడిలో చంద్రబాబు: తాత్కాలిక సచివాలయం పనులపై సంతృప్తి
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మిస్తోన్న తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులపై ఏపీ సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీ మంత్రలు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావులను వెంటబెట్టుకుని మంగళవారం ఉదయం చంద్రబాబు వెలగపూడికి వెళ్లారు.
తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి సీఆర్డీఏ అధికారులను అడిగి మరీ తెలుసుకున్నారు. పనుల్లో కొనసాగుతున్న వేగంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్ధల అధికారులు ఈ సందర్భంగా చంద్రబాబుకు చెప్పారు.
జూన్ 27లోపు తమ ఉద్యోగులను హైదరాబాద్ నుంచి నూతన రాజధాని అమరావతికి తరలించాలని నిర్ణయించామని, పనున్న మరింత వేగాన్ని పెంచాలని చంద్రబాబు వారికి సూచించారు. కాగా చంద్రబాబుతో పాటు రాజధాని అమరావతి ప్రాంతంలో 70 మంది జపాన్ సభ్యుల బృందం పర్యటించింది.

వారంతా రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంతో పాటు తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించనున్నారు. దీంతో పాటు జపాన్ పారిశ్రామికవేత్తలు అమరావతి చారిత్రక వైశిష్ట్యాన్ని చాటే వివిధ ప్రదేశాలను కూడా తిలకించే అవకాశం ఉంది. కాగా, రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం విజయవాడకు వచ్చిన జపాన్ బృందంతో చంద్రబాబు సోమవారం భేటీ ఆయిన సంగతి తెలిసిందే.
జపాన్‌కు అమరావతి రెండో ఇల్లు కావాలని, అమరావతిని సమష్టిగా నిర్మిద్దామని, మరో టోక్యో స్థాయిలో అభివృద్ధి చేస్తామని అందుకు మీ సహకారం కావాలని సోమవారం జపాన్ పారిశ్రామిక వేత్తలతో జరిగి సమావేశంలో చంద్రబాబు కోరారు. జపాన ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి యోసుకే తకాగి ఆధ్వర్యంలో 80 మంది పారిశ్రామికవేత్తలు ఇందులో ఉన్నారు.
ఈ సందర్భంగా జపాన్ బృందాన్ని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ... ఈ ఏడాదిలో మరో 150 జపాన్ కంపెనీలు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నానని అన్నారు. జపాన కష్టపడే తత్వం, క్రమశిక్షణ అంటే తనకు చాలా ఇష్టమని, భవిష్యత్తులో జపాన్-ఏపీల మధ్య మరింతగా సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications