హైదరాబాద్ అనుభవం: రాష్ట్ర విభజనపై జపాన్‌లో బాబు, జపాన్ ప్రధానికి శ్రీవారి లడ్డూ
టోక్యో: హైదరాబాదును అభివృద్ధి చేసిన అనుభవం తనకు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చెప్పారు. తెలుగు జాతిని అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలని స్వర్గీయ ఎన్టీఆర్ కోరుకున్నారన్నారు.
జపాన్‌లో తెలుగు వారితో బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఐటీ అభివృద్ధి కోసం తాము నాడు ఇంజినీరింగ్ కాలేజీలు పెంచామని తెలిపారు. విద్యకు ప్రాధాన్యమిస్తూ ఇంజినీరింగ్ కళాశాలలు తీసుకు వచ్చానని తెలిపారు.
చదువుకున్న వారికి ఉద్యోగ కల్పన కోసం మైక్రోసాఫ్ట్ తీసుకు వచ్చానని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగు వాడైన సత్య నాదెళ్ల ఉండటం గర్వకారణమని తెలిపారు. ప్రపంచం మొత్తం ఎక్కడకు వెళ్లినా తెలుగువారు కనిపిస్తారని చెప్పారు. గతంలో జపాన్ వచ్చినప్పుడు ఓ కమిటీ వేశామని చెప్పారు.

జపాన్ డెస్క్ ఇంఛార్జిని నియమించామన్నారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు వారు ఎక్కడున్నా కలిసే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగువారు కలిసి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. కష్టపడి పని చేసుకుంటే సమస్యలు అన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు.
జపాన్ ప్రధానితో చంద్రబాబు
ఏపీకి ఆర్థిక, సాంకేతిక సాయం అందిస్తామని జపాన్ ప్రధాని షింజో అబే అంతకుముందు చెప్పారు. అబేతో చంద్రబాబు దాదాపు పదిహేను నిమిషాలు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు తమ దేశ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని చంద్రబాబుకు ఆయన తెలిపారు.
ఏపీ రాజధాని నిర్మాణంలో మౌలిక వసతుల కల్పనలో జపాన్ సహకరిస్తుందని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని శంకుస్థాపనకు జపాన్ ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. ఆయన సానుకూలంగా స్పందించారు.
ఏపీ, జపాన్ సౌహార్ద సంబంధాలకు సంస్థాగతమైన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు కోరారు. కాగా, జపాన్ ప్రధానికి తిరుమల శ్రీవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోను చంద్రబాబు బహూకరించారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నుంచి శ్రీవారి లడ్డూను అందుకొని ప్రచారానికి బయలుదేరిన విషయాన్ని జపాన్ ప్రధాని గుర్తు చేశారు. చంద్రబాబు తనకు దగ్గరి వ్యక్తి అని షింజో అబే అన్నారు.












Click it and Unblock the Notifications