చంద్రబాబు కీలక నిర్ణయం-ఆ చిన్నారుల రేప్ ల విచారణకు స్పెషల్ కోర్టు..!
ఏపీలో నెల రోజుల క్రితం ఏర్పాటైన కూటమి సర్కార్ కు తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న చిన్నారుల రేప్, హత్యలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. అసలే కొత్త ప్రభుత్వం కావడం, చిన్నారుల రేప్ ల వ్యవహారంపై విమర్శలు రావడంతో ఇవాళ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత కీలక ప్రకటన చేశారు. ముచ్చుమర్రి, విజయనగరంలో చోటు చేసుకున్న రేప్ ల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ముచ్చు మర్రి లో అత్యాచారం, హత్యకు గురైన బాలిక మృత దేహం ఇంకా లభించలేదని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. విజయనగరం లో 6 నెలల పసికందుపై అత్యాచారం చేశారని తెలిపారు. తాగిన మైకంలో చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం చేశాడన్నారు. సీఎం చంద్రబాబు వీటిపై సమీక్షించారన్నారు. మద్యం మీద ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు చెప్పినట్లు హోంమంత్రి పేర్కొన్నారు.

మచ్చు మర్రి ఘటన, విజయనగరంలో ఆరు నెలల చిన్నారుల రేప్, హత్యపై స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు వంగలపూడి అనిత తెలిపారు. ముచ్చుమర్రిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెతికినా చిన్నారి మృతదేహం దొరకలేదన్నారు. ముచ్చు మర్రి బాధిత చిన్నారి కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఆరు నెలల చిన్నారి కుటుంబానికి ఐదులక్షలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.
అడపిల్లల్ని తప్పుగా చూసే వారికి భయం కలిగేలా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
నేరస్తులకు శిక్ష పడాల్సిందేనన్నారు. అందులో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఊరుకోబోమన్నారు. బైరెడ్డి మనుషులా..ఇంకా ఎవరైనా సరే వదలబోమన్నారు.












Click it and Unblock the Notifications